వైసీపీ అధినేత జగన్‌కు 2024 భారీ షాకేనని చెప్పాలి. పార్టీ ఓటమి, కీలక నాయకుల జంపింగులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఆ పరిణామాల నుంచి కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలించడం లేదు. పైగా.. 2024 పోతూ పోతూ కూడా.. భారీ షాట్లే కొట్టింది. సోమవారం సాయంత్రం ఉరుములు లేని పిడుగుల మాదిరిగా ఇద్దరు కీలక నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పుకొన్నారు. దీంతో ఈ ఊహించని పరిణామం వైసీపీకి భారీ షాక్ కొట్టినట్టయింది.
ఎవరెవరు?
మంగళగిరి పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న గంజి చిరంజీవి.. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే.. ఆయన ఎక్కడా బయట పడలేదు. పైగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అనూహ్యంగా సోమవారం సాయంత్రం ఆయన పార్టీ మారి.. జనసేన కండువా కప్పుకొన్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి రాధ కూడా పార్టీలో చేరారు. ఆమె రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి 2014లో టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే.. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో నారా లోకేష్ ఎంట్రీతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో అసంతృప్తికి గురయ్యారు.
తర్వాత వైసీపీ బాట పట్టిన గంజి చిరంజీవికి ఏడాది ఎన్నికల్లో తొలుత ఆయనకే టికెట్ ఇచ్చినట్టు జగన్ ప్రకటించారు. తీరా ఆయన ఎన్నికల ప్రచారానికి దిగే సమయానికి వ్యూహం మార్చి మహిళా అభ్యర్థిని నిలబెట్టారు. దీంతో చిరంజీవి అప్పటి నుంచి కూడా వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక, తాజాగా ఆయన ఎలాంటి ప్రకటన చేయకుండానే జగన్‌కు బై చెప్పి.. జనసేన కు జై కొట్టారు. ఇక, మరో నాయకుడు, ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ కూడా.. తాజాగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు.
ఉమ్మడికృష్ణాజిల్లా కైకలూరు నుంచి టీడీపీ తరఫున ఒకసారి విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాలేదు. దీంతో పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత.. వైసీపీలో చేరారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. బదులుగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. ఓడిపోయిన పార్టీలో ఉండనని.. అభివృద్ధి బాటలో ఉన్న కూటమికి జై కొడతానని పేర్కొంటూ..కొన్నాళ్ల కిందటే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక, అదేసమయంలో వైసీపీకి కూడా రిజైన్ చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా..అ ది ఇంకా పెండింగులోనే ఉంది. ఇంతలో టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా.. తాజాగా జనసేన పార్టీ కండువా కప్పుకోవడం గమనార్హం.