రాజకీయాల్లో ఉన్నవారికి టెన్షన్.. ప్రజర్ వంటివి కొత్తకాదు. రాజకీయాలు అంటేనే టెన్షన్‌తో ముడిపడిన ప్రెజర్‌తో కూడిన అంశా లు. వీటికి ఎవరూ అతీతులు కారు. జైల్లో ఉన్నప్పుడు… తనకు చుట్టూ గోడలే కనిపించాయన్న చంద్రబాబు ఎంత టెన్షన్ పడ్డారో తెలిసిందే. అలాంటి ఆయనకు జనసేన అధినేత ఆగమనంతో కొత్త దారి ఏర్పడింది.. వెలుగు రేఖలు ప్రసరించేలా చేసింది. అధికారం అందించింది. ఇదీ.. 2024కు ఉన్న ప్రత్యేకం. అలానే.. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణ రాజుకు కూడా.. ఈ 2024 పెద్ద పరీక్షే పెట్టింది.
ఈ ఏడాది తొలి ఐదు మాసాలు కూడా ఆయనకు నరాలు తెగే టెన్షన్ తప్పలేదు. ఎన్నికలకు ముందు.. తర్వాత.. ఆయన పరిస్థితిని గమనిస్తే.. ఔనా.. నిజమా! అనే సందేహాలు.. బుగ్గనొక్కుళ్లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు.. నామినేషన్ల ఘట్టం పూర్తవుతోంది. ఒకటి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అంతా సర్దుకున్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఉన్నారు. టికెట్ల కోసంతమ్ముళ్లు తన్నుకులాడుతున్నారు. చంద్రబాబు సైతం అన్ని సీట్లను ప్రకటించేశారు. అందరూ ప్రచారంలో మునిగిపోయారు. కానీ, రఘురామ పరిస్థితి అరణ్య వేదనగా మారింది.
ఏం జరుగుతుంది? తనకు వస్తుందని ఆశించిన నరసాపురం ఎంపీ టికెట్‌ను శ్రీనివాసవర్మకు బీజేపీ బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చేసింది. పోనీ.. టీడీపీఅయినా.. ఆదుకుంటుందని చూసినా.. అక్కడా అవకాశం కోసం అర్రులు చాచిన వారే కనిపించారు. దీంతో విపరీతమైన టెన్షన్.. ప్రెజర్. ఓడి గెలిచినట్టా.. గెలిచి ఓడినట్టా.. వైసీపీ నుంచి బయటకు రాకుండా ఉంటే.. జగన్‌పై విమర్శలు చేయకుండా ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో అనే సందేహాలు ముసురుకున్న సమయంలో చంద్రబాబు చివరి నిముషంలో కరుణించడంతో ఉండి నుంచి మంతెన రామరాజును తప్పించి.. రఘురామను ప్రకటించారు.
ఈ క్రమంలో విజయం దక్కించుకున్న రఘురామ.. ఆ తర్వాత కూడా టెన్షన్ ఫీలయ్యారు. ముందు మంత్రి పదవి అనుకున్నా రు. తర్వాత స్పీకర్ అనుకున్నా.. కానీ, రెండూ దక్కలేదు. అన్ని సీట్లూ ఫిల్ అయ్యాయి. ఇంకేటి ఇప్పుడు? అని తనను తానే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. ఇంత టెన్షన్‌లో ఓ రోజు మధ్యాహ్నం అనూహ్యంగా చంద్రబాబు నుంచి ఫోన్.. డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్.. అంతే అప్పటి వరకు పడిన టెన్షన్ గాలి పింజలా ఎగిరిపోయింది. ఇక, వెనుదిరిగి చూసుకోనక్కర లేకుండానే రఘురామ పొలిటికల్ లైఫ్ కుదురుకుంది. వెరసి.. 2024 ఆయనను పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదనే చెప్పాలి.