పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత తీవ్రంగా స్పందించారో తెలిసిందే. ఐతే పుష్ప-2కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అర్జున్ తన పేరు మరిచిపోవడం వల్లే ఈ కేసును రేవంత్ రెడ్డి అంత తీవ్రంగా తీసుకున్నారని.. బన్నీ మీద కక్ష గట్టి అతడి మీదికి పోలీసులను ఉసిగొల్పారనే ఒక ప్రచారం సోషల్ మీడియాలో నడిచింది.
ముఖ్యంగా రేవంత్ పేరును బన్నీ మరిచిపోవడాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ప్రయత్నించిన మాట వాస్తవం. ఐతే రేవంత్ తనకు ఐడెంటిటీ క్రైసిస్ ఎంతమాత్రం లేదని.. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని సోమవారం అసెంబ్లీలో చెప్పకనే చెప్పేశారు.
ఇటీవలే మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన కుమార్తె తనను గుర్తు పట్టని విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పడం విశేషం. మన్మోహన్‌కు నివాళి అర్పించే క్రమంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు.
మన్మోహన్ అంత్యక్రియల సందర్భంగా తనను దగ్గరికి పిలిచారని.. ఐతే పార్థివ దేహానికి దగ్గరగా వెళ్లి నిలబడ్డ సమయంలో ఒక మహిళ తనను మీరెవరని అడిగిందని.. తనకు కూడా ఆమె ఎవరో తెలియలేదని రేవంత్ తెలిపారు. తాను ఎవరో ఆమెకు తెలియలేదు, ఆమె ఎవరో తనకు తెలియలేదు అంటే ఆమె ఎంత సింపుల్ మనిషో అర్థం చేసుకోవచ్చని.. తన పిల్లల్ని మన్మోహన్ అంత బాగా పెంచారని.. పదేళ్ల పాటు ప్రధానిగా పని చేసిన వ్యక్తి పిల్లలు అంత సింపుల్‌గా వినయంగా ఉండడం అరుదైన విషయమని.. ఇది మన్మోహన్ గొప్పదనానికి నిదర్శనమని కొనియాడారు రేవంత్ రెడ్డి.
Gulte Telugu Telugu Political and Movie News Updates