జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కబోతోందని అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. జనసేనలో పవన్ తో పాటు కీలకంగా వ్యవహరించిన నాగబాబుకు ఖాళీగా ఉన్న మంత్రి పదవిని ఇవ్వబోతున్నారని ఖరారయింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేసినట్లు తెలుస్తోంది.
నాగబాబును మొదట ఎమ్మెల్సీని చేస్తామని, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వడం గురించి ఆలోచిస్తామని పవన్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా అన్నారట. అయితే, కుల సమీకరణాలతో, బంధు ప్రీతితో తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేయడం లేదని, పార్టీలో తనతోపాటు సమానంగా చాలాకాలం నుంచి కష్టపడుతూ వస్తున్నారు కాబట్టే ఆ పదవి దక్కనుందని పవన్ అన్నారట.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ది ఏ కులమో తనకు తెలీదని, ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చానని పవన్ గుర్తు చేశారట. రాజకీయాల్లో కులం ప్రామాణికం కాదని, పనితీరే కొలమానం అని అన్నారట. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారని, కాబట్టి ఎమ్మెల్సీ చేద్దామనుకుంటున్నామని అన్నారు. తనతో సమానంగా కష్టపడి పనిచేసినవారిని తాను చూసుకోవాలని చెప్పారట.
రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారని, తనతో సమానంగా కష్టపడి పనిచేసినవారిని తాను చూసుకోవాలని చెప్పారట. నాగబాబు విషయంలో వారసత్వ రాజకీయాలు అని అడుగుతారని, కానీ, వైఎస్ జగన్ విషయంలో మాత్రం అడగరని మీడియా ప్రతినిధులతో పవన్ వ్యాఖ్యానించారట. నాగబాబుకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం నేపథ్యంలో పవన్ పై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.