- సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు.
- గుంపుగా కాదు.. ఒక్కొక్కరికీ ఫోన్లు చేసి మరీ చంద్రబాబు దుమ్ముదులిపారు.
- మీ ఆగడాలు భరించలేకపోతున్నాను. మీపైనే ఎక్కువగా కంప్లెయింట్లు వస్తున్నాయి. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోండి- అని చంద్రబాబు హెచ్చరించారు.
- మీ దందాలు నా దాకా వినిపించాయి. ఇప్పటికైనా తీరు మార్చకపోతే రిజల్ట్ డిఫరెంటుగా ఉంటుంది.
- ఇసుక, మద్యం విషయంలో వేలు పెట్టద్దని ఎన్ని సార్లు చెప్పాలి. మీరు మారకపోతే.. నేనే మారతా!
–ఇదీ.. శనివారం రోజు రోజంతా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, ప్రచారం, సమాచారం కూడా!!
ఇదిగో పులి అంటే.. అదిగో తోక! అన్నట్టుగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియాలో జరిగిన ఈ ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యేలు నివ్వెర పోయారు. అరరే.. మాకే తెలియదే.. చంద్రబాబు ఎవరికి క్లాసిచ్చారబ్బా! అని వారు బుగ్గలు నొక్కుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. ఆ రేంజ్ లో కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లోని సోషల్ మీడియా ఇన్ల్ఫుయెన్సర్లు ఆ రేంజ్‌లో ప్రచారం దంచి కొట్టారు. ఒక్కొక్కరుగా కాదు.. ఎమ్మెల్యేలకు మూకుమ్మడిగానే చంద్రబాబు క్లాసిచ్చారని రాసుకొచ్చారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రచారం దుమ్మురేపింది. అయితే.. ఇది నిజమే అయి ఉంటుందని.. కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. కాబట్టి చంద్రబాబు వారికి క్లాస్ ఇచ్చి ఉంటారని కొందరు మేధావులు వీడియోలు కూడా చేసి యూట్యూబ్‌లో పెట్టారు. అయితే.. సాయంత్రం అయ్యాక.. గంటలు గడిచాక.. ఇది బోగస్ అని తేలి పోయింది. ఎందుకంటే.. శనివారం రోజు రోజంతా.. చంద్రబాబు సమీక్షలతోనే కాలం గడిపారు.
పోనీ.. శుక్రవారం ఆయన ఏమైనా ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారా? అని చూస్తే.. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు. దివంగత మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటంబానికి సంతాపం తెలిపారు. అక్కడే గడిపారు. సో.. ఈ రెండు రోజుల్లో అవకాశం లేదు. ఇక, దీనికి ముందు అసలు అవకాశం కూడా లేదు. కాబట్టి.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం బోగస్ అని తేలిపోయింది. అయితే.. ఒకటేంటే.. ఈ ప్రచారంతో ఎమ్మెల్యేలు అలెర్ట్ అయ్యారు. ఏమో.. గుర్రం ఎగరావొచ్చు.. అన్నట్టుగా చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారేమోనని కొందరు ఎమ్మెల్యేలు చర్చించుకుని.. ప్రధాన మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేయడం గమనార్హం.