బాబు మంచితనం తమ్ముళ్లకు తెగ ఇబ్బందిగా మారిందా?

ప్రత్యర్థిని శత్రువుగా చూసే ధోరణి తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు సర్వసాధారణమైనప్పటికి.. పాతికేళ్ల క్రితం వరకు ఈ ధోరణి ఉండేది కాదు. అదే ముప్ఫై ఏళ్ల క్రితం అయితే.. అలాంటి ధోరణిని ప్రదర్శించే అధినేతల్ని.. నేతలకు కనీస గౌరవం దక్కేది కాదు. దక్షిణాదిలో ఈ తరహా ధోరణికి మొదట గండి పడింది తమిళనాడులోనే. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థుల్ని అగర్భ శత్రువులుగా పరిగణించటమే కాదు.. ప్రత్యర్థి పార్టీల నేతలతో మాట్లాడే వారిని ద్రోహులుగా చూసేవారు. వారికి రాజకీయ అవకాశాల్ని కల్పించే విషయంలో అధినేతలు సైతం సానుకూలంగా ఉండేవారు కాదు. తమిళనాడు రాజకీయాలు.. అక్కడి రాజకీయ ద్వేషాన్ని చూసిన పలువురు ఆ ధోరణి తెలుగు రాజకీయాల్లో లేదని సంతోషపడేవారు.

దానికి భిన్నంగా గడిచిన కొన్నేళ్లుగా తెలుగు గడ్డ మీదకు తమిళనాడు రాజకీయం వచ్చేసింది. ప్రత్యర్థులను దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని వదలని తీరుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకమనే చెప్పాలి. పాత తరం రాజకీయాలకు కాస్తంత వర్తమాన రాజకీయాన్ని కలిపి.. కొత్త తరహా బ్లెండ్ ను పరిచయం చేసిన ఘనత బాబుదేనని చెప్పాలి. ఈ కారణంగానే ఆయన్ను సంప్రదాయవాదులే కాదు.. దూకుడు రాజకీయాల్ని ఫాలో అయ్యే వారూ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే.. సంప్రదాయవాదులకు విధ్వంసకర రాజకీయాలకు అవకాశం ఇచ్చారన్న కోపం ఉండగా.. వర్తమాన రాజకీయవాదులేమో.. ఇప్పటి కాలానికి తగినట్లుగా లేని పిరికి అధినేతగా పేర్కొంటూ ఎగతాళి చేస్తుంటారు.

రాజకీయాల్లో చంద్రబాబుకు ఎదురైన ఆటుపోట్లు.. ఎదురుదెబ్బల కారణంగా ఆయనలో మార్పు కొంత వచ్చినప్పటికి.. నేటికీ.. దూకుడు రాజకీయాల్ని వంట పట్టించుకునే విషయంలో చాలా దూరంలోనే ఆగిపోయారని చెప్పాలి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కార్యకర్తలకు అండగా నిలుస్తామని.. అధికారంలోకి రాగానే తమ పార్టీ వారిని ఇబ్బందులకు గురి చేసిన వారి సంగతి తేలుస్తామని.. కన్నుకు కన్ను.. పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడతారు కానీ.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రూల్ ప్రకారమే పోవాలన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది.

అందుకే చంద్రబాబు కోసం తెగించి పోరాడే నేతలు పెద్దగా కనిపించరు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో.. చాలా పార్టీ కార్యకర్తలు.. ఫాలోవర్లు దూకుడుగా కనిపిస్తారు తెలుగు తమ్ముళ్లతో పోలిస్తే. పెద్దరికపు తరహాలో.. దూకుడుగా వ్యవహరించే విషయంలో వెనుకబడి ఉండటం వల్ల ఎదురయ్యే గడ్డు పరిస్థితుల్ని ఎంతలా ఉంటాయన్నది వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు తమ్ముళ్లకు ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష హోదా చంద్రబాబుకు కొత్తేం కాకున్నా.. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కోని సవాళ్లను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చంద్రబాబు.. తనను తాను మారిన చంద్రబాబుగా పరిచయం చేసుకున్నారు.

దీంతో.. ఆయనతీరుపై భారీ అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత కూడా చంద్రబాబు తీరులో పెద్దగా మార్పు రాకపోవటంపై తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. గత ప్రభుత్వంలో తమను ఇబ్బందులు పాల్జేసిన అధికారులకు అప్రాధాన్యత పోస్టుల్లోకి పంపే కార్యక్రమం సైతం నెమ్మదిగా సాగటంపై పార్టీ క్యాడర్ లో తీవ్ర అసంత్రప్తి ఉంది. అయినప్పటికీ.. చంద్రబాబు చెప్పే పెద్దరిక మాటలకు తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ల మాదిరే కొందరు ఫైర్ బ్రాండ్ నేతలు సైతం కిందామీదా పడిపోతున్నారు.

ఇక.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ కం టీడీపీ సీనియర్నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు అయితే తమ అసహనాన్ని దాచుకోలేకపోతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా తమ మనసులోని మాటల్ని చెప్పేందుకు వెనుకాడటం లేదు. తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మంచితనంతో మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి వస్తున్నారు. ఆయన మంచితనంతో మా చేతులు కట్టేశారు’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజంగానే చంద్రబాబు మంచివారా? అంటే.. ఇప్పటి నేతలతో పోల్చినప్పుడు ఆయన పాతతరంలో ఉన్నట్లే. అందుకే.. చంద్రబాబును మొత్తంగా కాకున్నా.. కొంత మేర అయినా మారాలని కోరుకుంటున్న వారిలో టీడీపీ నేతలే కాదు. తెలుగు తమ్ముళ్ల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి.