వివాద ర‌హితుల‌కే వీర‌తాళ్లు.. చంద్ర‌బాబు ఆలోచ‌న‌!

మ‌రో రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నెల 31తో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నీర‌భ్‌కుమార్ ప్ర‌సాద్ ప‌దవీ కాలం పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో కొత్త వారికి అందునా సీనియర్ల‌కు అవ‌కాశంక ల్పించాల్సి ఉంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల మేర‌కు.. సీనియ‌ర్ల‌తోపాటు.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేవారి వైపు సీఎం మొగ్గు చూప‌వ‌చ్చు.

ప్ర‌భుత్వాధినేత సీఎం కాబ‌ట్టి.. ఆయ‌న ఎంపిక చేసే విధానం ఫైన‌ల్ కానుంది. ఈ క్ర‌మంలో ముగ్గురి పేర్ల‌ను చంద్ర‌బాబు సూచిస్తే.. దానికి యూపీఎస్సీ, కేంద్ర హోం శాఖ‌లు ఒక‌రిని ఎంపిక చేసి అనుకూ లంగా ఆమోద ముద్ర వేస్తాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారుల విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. వీరిలో కొన్నాళ్లు సాయిప్ర‌సాద్ వైపు స‌ర్కారు మొగ్గు చూపుతోంది. అయితే.. ఇంత‌లో మ‌రో పేరును చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిసింది.

గ‌తంలోనూ, ఇప్పుడు కూడా.. చంద్ర‌బాబుకు అనుకూల అధికారిగా పేరు పొందిన క‌డ‌ప జిల్లాకు చెందిన విజ‌యానంద్‌ను ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తీసుకోవాల‌ని యోచిస్తున్న‌ట్టు ప్రభుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈయ‌న ప‌ద‌వీ కాలం వ‌చ్చే ఏడాది న‌వంబ‌రు వ‌ర‌కు ఉంది. సాయిప్ర‌సాద్ అయితే.. మ‌రో రెండేళ్ల పాటు స‌మ‌యం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో విజ‌యానంద్ ప‌నితీరు, ఆయ‌న అణుకువ‌, సీఎం పట్ల ఉన్న విధేయ‌త వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. త‌దుప‌రి పేరుగా విజ‌యానంద్‌వైపు చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది.

ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు పొడిగించిన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో విజయానంద్ ను నియమించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు స‌మాచారం. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో దీనికి సంబంధించిన‌ అధికారిక ప్రకటన వెలువడనుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది నవంబరులో విజ‌యానంద్‌ రిటైరయ్యాక సాయిప్రసాద్ ను సీఎస్ గా నియమించాలని నిర్ణయానికి వచ్చిన‌ట్టు చెబుతున్నారు. మొత్తానికి విధేయ‌త‌కు చంద్ర‌బాబు వీర‌తాడు వేయ‌నున్నార‌ని ప్రచారం సాగుతోంది.