తాను తప్పు చేసినా.. పొరుగు వాడు తనపై బురద జల్లుతున్నాడనే రకం రాజకీయాలు సాగుతున్నాయి. తను చేసింది తప్పయినా.. అంగీకరించలేని పరిస్థితిలో నాయకులు ఉన్న పాలిటిక్స్ ప్రస్తుతం కొనసాగు తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని రాజకీయాలు కూడా ఇలానే ఉన్నాయి. రాజకీయ కక్షతోనే నాపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారు
అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కానీ, వాస్తవం ఏంటి? అనేది చూస్తే.. ఈ వ్యాఖ్యల మర్మం తెలుస్తుంది.
ఇదీ.. వాస్తవం!
మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పేర్ని సతీమణి జయసుధ పేరుతో గిడ్డంగులు నిర్మించుకున్నారు. వీటిని ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చారు. ఈ గోదాముల్లో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం నిల్వ చేసింది. అయితే.. ఈ గోదముల్లోనే కొన్ని క్వింటాళ్ల బియ్య బస్తాలు.. మాయమయ్యాయి. ఇది ఆరోపణ కాదు.. వాస్తవం. అధికారులు లెక్కలు కూడా చూపించారు. దీనికి పేర్ని కుటుంబం కూడా ఔను.. నిజమేనని అంగీకరించింది. పోనీ.. అక్కడితో కూడా వదల్లేదు.
ఆ వెంటనే 1.62 కోట్ల రూపాయలను జరిమానాగా ప్రభుత్వానికి పేర్ని కుటుంబం చెల్లించింది. అంటే.. గోదాముల్లో నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నారని.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అంగీకరించిన ట్టే కదా! అయినా.. పేర్ని మాత్రం తనపై కుట్రలు జరుగుతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఓ దొంగ ఒక ఇంట్లో వస్తువును పట్టుకుపోయారని అనుకుందాం. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సదరు దొంగ ఆ వస్తువుకు నష్టపరిహారం చెల్లించారని అనుకుందాం. అంత మాత్రాన పోలీసులు కేసు పెట్టకుండా.. సదరు దొంగను అరెస్టు చేయకుండా ఉంటారా? !
అంటే.. పేర్ని వాదన ఇలానే ఉంది. మేం ఫైన్ కట్టేశాం కాబట్టి.. మాపైకేసులు పెట్టరాదన్నది ఆయన వితండ వాదన. ఏదైనా కేసు పెడితే.. తనపైనా.. తన కుటుంబంపైనా కుట్రలు చేస్తున్నారన్నది ఆయన ఎదురు దాడి. గోదాము నుంచి బియ్యం షార్టేజీ వచ్చిందనే అంశా న్ని సాకుగా చూపిస్తూ, నాతో పాటు నా భార్య, కుమారుడిని కూడా అరెస్ట్ చేయాలని చేస్తున్నారు
అని పేర్ని చెప్పుకొచ్చారు. మరి ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపైనా ఇలాంటి అభియోగాలే మోపినప్పుడు.. అవి కుట్రలు కాదని ఎలా చెప్పుకొచ్చా రో.. ఈ పేర్నే చెప్పిఉంటే బాగుండేది. చేయాల్సింది చేసి.. తప్పులు బయట పడ్డాక.. ఇలా కుట్రల పేరుతో రాజకీయం చేస్తే.. ప్రభుత్వాలు కాదు.. ప్రజలు కూడా ఆలోచిస్తారు సర్!!