అమరావతి రయ్.. రయ్.. బిట్స్.. లా వర్సిటీ

ఆంధ్రుల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. 2014లో జరిగిన తప్పుల్ని రిపీట్ చేయని ఆయన.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజధాని అమరావతి విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో.. అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా రానున్న సంస్థల వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) క్యాంపస్ కు సీఆర్ డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. ఇందుకోసం సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే.. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలోని స్థలం కావాలని కోరింది. తమ సంస్థ భవనాలను ఆలయం నమూనాలో నిర్మిస్తామని బిట్స్ పేర్కొంది.

వాస్తవానికి బిట్స్ కు.. ఎస్ఎంఆర్.. విట్.. అమ్రత లాంటి విద్యా సంస్థలకు కేటాయించిన నేలపాడు.. ఐనవోలు ప్రాంతాల్లో స్థలం ఇవ్వాలని సీడీఆర్ఏ భావించినా.. బిట్స్ మాత్రం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే కావాలని కోరింది. అయితే.. ఆ ప్రాంతంలో అయితే 35 ఎకరాలు మాత్రమే ఇవ్వగలమని చెప్పినా అందుకు ఓకే చెప్పింది. నిజానికి నేలపాడు.. ఐనవోలులో అయితే 50 – 100 ఎకరాలు కేటాయించేందుకు సీడీఆర్ఏ సిద్ధంగా ఉంది. అయితే.. అందుకు బిట్స్ సుముఖంగా లేదు.

ఇదిలా ఉండగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమరావతిలో లా వర్సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో పాటు.. మరిన్ని విద్యా సంస్థలు అమరావతికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.వీటితో పాటు పలు కేంద్ర ప్భుత్వ రంగ సంస్థల కార్యాలయాలు.. ప్రభుత్వ రంగ సంస్థల ఆఫీసుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు విడివిడిగా స్థలాల్ని కేటాయించారు. అయితే.. మూడేళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయని కారణంగా ఆ కేటాయింపులు సాంకేతికంగా రద్దు అయ్యాయి. ఇప్పుడు వాటిని రెన్యువల్ చేసే పనిలో ఉన్నారు.

గతంలో మాదిరి కాకుండా ఈసారి కేంద్ ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు విడివిడిగా కాకుండా.. అన్నింటికి కలిపి ఒకేచోట భవనాన్ని ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు.. కార్పొరేషన్లకు గతంలో కేటాయించిన స్థలాల్ని రద్దు చేసి.. వాటి కార్యాలయాలను సచివాలయం.. హెచ్ వోడీల కార్యాలయ భవనాల టవర్లలోనే ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. సెంట్రల్ లైబ్రరీ.. స్టేట్ మ్యూజియం.. ల్యాబ్ లకు మాత్రం విడిగా స్థలాల్ని కేటయిస్తున్నారు. మొత్తంగా గడిచిన ఐదేళ్లలో అమరావతివైపు చూడని పలు సంస్థలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా హుషారుగా అక్కడ తమ సంస్థలని ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.