తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చొక్కా విప్పి, కొరడాతో ఆరు సార్లు స్వయంగా కొట్టుకున్న ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గురువారం జరిగిన మీడియా సమావేశంలో అన్నామలై డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, యువతకు భద్రత లేదని, విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి డీఎంకేకు చెందినవాడే అని ఆరోపించారు. తన పోరాటంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులు కూడా వేయనని శపథం చేశారు. ఆయన ఈ నిరసనతో 48 రోజుల నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు అన్నామలై చెప్పినట్లుగానే కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆయన చర్య ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినిపై జరిగిన ఘటనకు సమాధానం చెప్పడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. అన్నామలై వినూత్న నిరసనతో బీజేపీ కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలిపారు. డీఎంకే శ్రేణులు, ప్రతిపక్షాలు ఈ చర్యను వ్యతిరేకించాయి. ఈ పరిస్థితుల్లో అన్నామలై పోరాటం రాజకీయంగా ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.