రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చెప్పిందిదే…

టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఉండవని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ క్రమంలోనే సినీ పెద్దలు రేవంత్ తో భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఆ ఘటనను సీరియస్‌గా తీసుకోవాల్సి వచ్చిందని రేవంత్ అన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమను ఇప్పటిదాకా అందరు ముఖ్యమంత్రులు బాగానే చూసుకున్నారని, ఈ ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంటోందని లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. దిల్‌ రాజును టీఎఫ్ డీసీ చైర్మన్‌గా నియమించడాన్ని ఇండస్ట్రీ తరఫున స్వాగతిస్తున్నామన్నారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు.

ఇక, హైదరాబాద్ లో యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలని హీరో, నిర్మాత నాగార్జున అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని, అలా అయితేనే గ్లోబల్ స్థాయికి చిత్ర పరిశ్రమ ఎదుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలన్నది తమ కోరిక అని అన్నారు.

ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు మాదిరిగానే సినిమా విడుదలయ్యే మొదటి రోజు హడావిడి ఉంటుందని మాజీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. సంధ్య థియేటర్ ఘటన చిత్ర పరిశ్రమను బాధించిందని చెప్పారు. సినిమాల మధ్య పోటీ వలన ప్రమోషన్ కీలకంగా మారిందని తెలిపారు. ఇక, తాను చిన్నప్పటి నుంచి టాలీవుడ్ లోని పరిస్థితులను చూస్తున్నానని, హైదరాబాద్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాలని నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది తమ డ్రీమ్ అని దగ్గుబాటి సురేష్‌బాబు చెప్పారు. ప్రభుత్వ సాయంతోనే చెన్నై నుంచి హైదరాబాద్‌ కు ఇండస్ట్రీ వచ్చిందని సురేష్‌బాబు అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి అన్ని ఓటీటీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలని అభిప్రాయపడ్డారు. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని త్రివిక్రమ్‌ అన్నారు.