సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని నిరూపిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరి కోరిక మేరకు.. చంద్రబాబు.. అరకు కాఫీని ప్రొమోట్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉన్నప్పుడు.. నారా భువనేశ్వరి.. విశాఖకు వెళ్లారు. అప్పట్లో ఓ కాఫీ క్లబ్‌లో అరకు కాఫీని సేవిస్తూ.. వాట్సాప్‌లో చంద్రబాబుతో ముచ్చటించారు. అరకు కాఫీ బాగుందని తెలిపారు.
అంతేకాదు.. దీనిని దేశవ్యాప్తంగా పరిచయం చేస్తే.. గిరిజనులకు మరింత ఆదాయ మార్గాలు పెరుగుతాయని భువనేశ్వరి అప్పట్లోనే పేర్కొన్నారు. ఆ తర్వాత.. దీనిపై చర్చ రాలేదు. కానీ, సీఎం అయిన తర్వాత.. చంద్రబాబు తనను ఎవరు కలిసినా.. తను ఎవరిని కలిసినా.. వెంటనే అరకు కాఫీ బాటిళ్లు(6) ఉన్న ఒక అందమైన ప్యాక్ను వారికి కానుకగా ఇస్తున్నారు. సాధారణంగా.. ఎవరైనా గెస్టులు వస్తే.. వారికి శాలువా కప్పి ఏదైనా మాన్యుమెంటును వారికి అందించడం ఆనవాయితీ.
అయితే.. గత ఆరు మాసాలుగా.. చంద్రబాబు ఎవరు తననుకలిసినా అరకు కాఫీ ప్యాక్‌ను చేతిలో పెడుతున్నారు. ఇటీవల ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు కూడా.. ఇదే ఇచ్చి.. సత్కరించారు. రెండు రోజుల కిందట జపాన్ నుంచి ప్రతినిధి బృందం పెట్టుబడుల కోసం విజయవాడకు వస్తే.. అధికారులు కూడా.. సీఎం ఇమ్మన్నారంటూ.. అరకు కాఫీ ప్యాక్‌ను అందించి సంత్కరించారు. ఇక, చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. తన వెంట ఇలాంటి పది పదిహేను అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌లు తీసుకువెళ్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న సందర్భంగా కూడా ఆయన అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌నే ఆయన చేతిలో పెట్టారు. అదేవిధంగా కేంద్ర మంత్రులకు కూడా ఇవే ఇచ్చారు. సహజంగా వెంకటేశ్వరస్వామి ప్రతిమలు, ఇతర గిఫ్టులను అందించడం చూస్తున్నాం. కానీ, చంద్రబాబు గిరిజన కాఫీ రుచిని దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా .. పరిచయం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అరకు కాఫీ అమ్మకాలు మరింత పుంజుకుంటాయన్న చర్చ సాగుతోంది.