ప‌ద‌హారు వేల‌ ప‌దవులు.. చంద్ర‌బాబు బీసీ మంత్రం.. !

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో బీసీ మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు. వారికి ఇప్ప‌టికే.. స‌రైన స‌ముచిత ప్రాధాన్యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. మంత్రి వ‌ర్గంలో చోటు పెట్టారు. అదేవిధంగా కార్పొ రేష‌న్ ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అయినా.. ఎక్క‌డో బీసీల్లో అసంతృప్తి పెరుగుతోంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు స‌రికొత్త మంత్రం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఏకంగా 16500 బీసీ నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని చూస్తున్నారు.

నిజానికి ఆయా ప‌ద‌వులు.. గ‌త వైసీపీ హ‌యాంలో ప‌క్క‌న పెట్టారు. నిధుల కొర‌త‌.. కార్యాల‌యాల ఏర్పాటు .. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డ‌డం వంటి కార‌ణాల‌తో 16500 ప‌ద‌వులను కూడా.. ప‌క్క‌న పెట్టారు. అయినప్పటికీ.. ఆలోటు రాకుండా జ‌గ‌న్ మేనేజ్ చేయ‌గ‌లిగారు. ఇత‌ర ప‌ద‌వుల‌తో వారిని సంతృప్తి ప‌రిచారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబుకు ఇంటా బ‌య‌టా కూడా.. బీసీల నుంచి ఒత్తిడి పెరిగింది. దీనిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఫ‌లితం క‌నిపించ‌డం లేదు.

దీంతో మ‌రుగున ప‌డ్డ బీసీ ప‌ద‌వులను తెర‌మీదికి తీసుకువ‌చ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే బీసీ సామాజిక వ‌ర్గాల కార్పొరేష‌న్ల‌ను పెద్ద ఎత్తున బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఈ ర‌కంగా మొత్తం 16500 ప‌ద‌వుల‌ను వారికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌ద్వారా సంతృప్తి పెంచాల‌ని చూస్తున్నారు. వీటిలో నాయీబ్రాహ్మ‌ణ‌, ర‌జ‌క‌, వ‌డ్డెర త‌దిత‌ర కులాల‌కు ప్రాధాన్యం ఇస్తారు.

అయితే.. ఇప్ప‌టికే వీరికి కార్పొరేష‌న్లు ఉన్నందున స్థానికంగా ఉండే వెసులుబాటును బ‌ట్టి ప‌ద‌వులు ఇవ్వ నున్నారు. అదేవిధంగా బీసీల్లో మేధావులు, విద్యావంతుల‌కు వీసీలుగా.. ఉన్న‌త విద్యామండ‌లిలోనూ ..ఏపీపీఎస్సీలోనూ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇవ‌న్నీ.. వెయ్యిలోపు ఉంటాయి. కానీ, ఇత‌ర ప‌ద‌వుల విష‌యంలో మాత్రం కొంత మేర‌కు ఆల‌స్యం జ‌రిగే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యానికి మొత్తంగా 10 వేల‌కుపైగానే నామినేటెడ్ పోస్టుల‌ను బీసీల‌కు అందించాల‌న్న‌ది చంద్ర‌బాబు ల‌క్ష్యం. త‌ద్వారా స్థానిక ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌ని భావిస్తున్నారు.