రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు కామనే! అయితే, ఇది ప్రత్యర్థులపై వేసే ఎత్తుగడలకు నిదర్శనం. కానీ, మిత్రపక్షంతో నూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా? మిత్రపక్షంతో ఉంటూనే.. మరో పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తారా? ఇప్పడు బీజేపీలో జరుగుతున్న అంతర్మథనం ఇదే! ప్రస్తుతం తమకు మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను చూసి.. బీజేపీ నాయకులు మురిసిపోతున్నారనేది వాస్తవం. ఆయన వల్ల తమ పార్టీకి 1 శాతమైనా ఓటు బ్యాంకు పెరగకపోతుందా.. కుదిరితే కప్పుకాఫీ అన్నట్టు అధికారంలోకి రాకపోతామా? అని వారు చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, జరుగుతున్న పరిణామాలను చూస్తే.. కమల నాథులకు నిద్ర పట్టడంలేదు. పవన్ వ్యూహాలతో వారికి మతి పోతోంది!
మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ చాలానే ఆశలు పెట్టుకుంది. అధికార టీఆర్ ఎస్ బలహీనతలు, సీఎం కేసీఆర్‌పై హైదరాబాదీల్లో ముఖ్యంగా ఏపీకి చెందిన సెటిలర్స్‌లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఈ క్రమంలోనే తమ మిత్రపక్షంగా ఉన్నపవన్‌తో కలిసి ఎన్నికల గోదాలోకి దిగాలని నిర్ణయించుకుంది. మిత్రపక్షం ఎక్కడైనా మిత్రపక్షమే కదా అనుకున్నారు బీజేపీ నాయకులు. ఈ క్రమంలోనే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని జోక్యం చేసుకోవాలని కోరారు. కానీ, పవన్ నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు.
దీనికి కూడా పవన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇంతలోనే పవన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు 40 కార్పొరేట్ స్థానాల్లో ఒంటరిగానే జనసేన రంగంలోకి దిగుతుందనేది దీని సారాంశం. అది కూడా సెటిలర్లు ఎక్కువగా ఉన్న వార్డులు కావడంతో బీజేపీ తల పట్టుకుంది. అసలు ఏం జరుగుతోంది? అని ఆరా తీసేపనిలో పడింది.
ఇదిలావుంటే, పవన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థన, సూచనల నేపథ్యంలోనే బీజేపీతో కలవకుండా.. సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు మరో ప్రచారం తెరమీదికి వచ్చింది. అంటే.. కేసీఆర్ తనకు వ్యతిరేకంగా ఉన్న వార్డులను జనసేనకు ఇచ్చేశారని, ఆయా చోట్ల బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా పవన్‌ను అడ్డువేశారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ.. పవన్ కేసీఆర్‌తో చేతులు కలిపినట్టే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా.. పవన్ వ్యూహం ఇప్పటికైతే.. బీజేపీకి అంతుచిక్కలేదనేది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates