జమిలి వస్తుంది..మీ జగన్ గెలుస్తున్నాడు

‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, అటువంటిదేమీ లేదని, జమిలి చట్టం అమల్లోకి వచ్చినా 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, మీ జగన్ గెలుస్తున్నాడు అని కార్యకర్తలతో జగన్ అన్న మాటలు వైరల్ గా మారాయి.

యూపీతోపాటు ఏపీలో 2027లో మళ్లీ ఎన్నికలు రాబోనున్నాయని, తాను గెలవబోతున్నానని జగన్ సంచలన ప్రకటన చేశారు. కష్టాలు శాశ్వతం కాదని, అబద్ధాలు చెప్పలేకే ప్రతిపక్షంలో ఉన్నామని పులివెందులలో కార్యకర్తలతో జగన్ అన్నారు.

కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకునేలా పాలన చేశామని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చామని చెప్పారు. మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలు గ్రహించి ఆదరిస్తారని, అధికారం లేకపోయినా ప్రజల కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలవిగాి హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.

కళ్లు మూసుకుని తెరిచేలోపు 6 నెలలు గడిచిపోయాయని, ఇంకో రెండేళ్లు కళ్లు మూసుకుంటే 2027లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఆ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని జగన్ అన్నారు. ‘అవినాశ్ బిర్యానీ పెట్టకపోయినా.. పలావ్ తినిపిస్తాడు’ అని జగన్ అన్న మాటలు వైరల్ అయ్యాయి.