రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు కాబట్టి ఈ శాలువాలను వేరే వారికి ఇవ్వాలన్న ఆలోచన రాదు. దీంతో, ఆ శాలువాలలో చాలా బీరువాలలో నిరుపయోగంగా పడుంటాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్సులు కుట్టించే వినూత్న ఆలోచనకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు.
అప్పుడపుడు వివాదాలలో పేరు వినిపించినప్పటికీ తన నియోజకవర్గంలోని అనేక సామాజిక కార్యక్రమాల్లో చింతమనేని స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమవుతుంటారన్న పేరుంది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్ లు కుట్టించాలన్న వినూత్న కార్యక్రమాన్ని చింతమనేని చేపట్టారు. తనను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఇచ్చిన ఖరీదైన శాలువాలతో వివిధ సైజులలో చిన్నారులకు గౌన్లు, డ్రెస్ లు కుట్టించారు చింతమనేని.
అలా కుట్టించి వదిలేయకుండా ప్రతివారం స్థానికంగా ఉండే, హాస్టళ్లు, అనాధాశ్రమాలలోని విద్యార్థులకు, చిన్నారులకు స్వయంగా చింతమనేని పంచిపెట్టారు. ఈ 6 నెలల కాలంలో తనకు వచ్చిన శాలువాలతో దాదాపు 250 మంది పిల్లలకు బట్టలు కుట్టించగలిగామని, ప్రతి రాజకీయ నాయకుడు ఈ పద్ధతి ఫాలో అయితే బాగుంటుందని అన్నారు. చింతమనేని చేస్తున్న మంచిపనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates