చంద్ర‌బాబుకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత పాటే పాడారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌లు చూస్తే.. తన క‌డుపు త‌రుక్కుపోతోంద‌న్నారు. త‌న‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌ని చెప్పారు. వైసీపీ పాల‌న‌లో ధ్వంసమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఎలా గాడిలో పెట్టాలో కూడా.. త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు. వాస్త‌వానికి చంద్రబాబు ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. అనేక సంద‌ర్భాల్లో ఇది చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దారిలో పెడుతున్నామ‌న్నారు.

ఇప్ప‌టికి దాదాపు 7వ మాసంలోకి ప్ర‌భుత్వం అడుగు పెట్టింది. మ‌రి గ‌డిచిన ఆరు మాసాల్లోనే గాడిలో పెట్టార‌ని అంద‌రూ అనుకున్నారు. పైగా.. 14 ఏళ్ల సీనియ‌ర్ అయిన‌.. చంద్ర‌బాబు ఇప్పుడు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాన‌ని చెప్ప‌డం ఆయ‌నకు మైలేజీ ఇస్తుంద‌ని భావించినా.. ప్ర‌తిప‌క్షాల‌కు మాత్రం ప‌దునైన ఆయుధాలు అందిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. కొన్నాళ్ల వ‌ర‌కు ఈ వాద‌న బాగానే ఉంది. అంద‌రూ హ‌ర్షించారు. కానీ, ఇంకా ఆరు మాసాలు అయిపోయిన త‌ర్వాత‌కూడా.. అదే పాట పాడితే.. న‌ప్ప‌డం లేదు.

ఇవ‌న్నీ.. ఇలా ఉంటే.. అస‌లు చంద్ర‌బాబుకు ఆర్థిక స‌మ‌స్య‌లు ఎన్నిఉన్నాయి? ఎలా ఉన్నాయి? అనేవి కీల‌కంగా మారాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో సంప‌ద సృష్టి లేక‌పోవ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంది. నిజానికి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సంప‌ద సృష్టిపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. కానీ, ఇది పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. మ‌ద్యం షాపుల ద్వారా కొంత ఆదాయం వ‌చ్చినా.. అది వంట గ్యాస్ రాయితీ రూపంలో పోయిందనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఇక‌,పెంచిన పింఛ‌న్ల భారం.. స‌ర్కారు ఇబ్బందిగా మారింది.

దీనికితోడు.. మ‌రిన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల్సిరావ‌డంతో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు వ‌స్తున్నా యి. ఇక‌, చెత్త‌ప‌న్నును నిలిపివేసిన ద‌రిమిలా.. మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌కు ఇప్పుడు ఆ నిధుల‌ను ప్ర‌భుత్వ‌మే ఇవ్వాల్సి వ‌స్తోంది. అదేవిధంగా.. ఉద్యోగుల‌కు నెలకు ఠంచనుగా వేత‌నాలు ఇవ్వాల్సి వ‌స్తోంది. వీటికి కూడా.. వ‌స్తున్న ఆదాయానికి చేస్తున్న ఖ‌ర్చుల‌కు పొంత‌న లేకుండా పోయింది. రిజిస్ట్రేష‌న్ల ఆదాయం ఆగిపోయింది. చెత్త‌పై ప‌న్ను నిలిచిపోయింది. వెర‌సి.. మొత్తంగా ఇప్పుడు స‌ర్కారుకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయితే ఇవేన‌న్న‌ది మేధావుల మాట‌.