ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పక్షాన ఆయన విజయం దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. పార్లమెంటులోను బయట కూడా.. ప్రతిపక్షాల దూకుడుతో ఒకింత సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ధరల భారం.. పెరిగిపోయి.. రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు.. పిల్ల దేశాలైన బంగ్లాదేశ్ వంటివాటి నుంచి కూడా హూంకరింపులు ఎదురవుతు న్నాయి. పెట్రోల్ ధరలు .. అంతర్జాతీయంగా దిగి వచ్చినా.. దేశంలో మోడీ సర్కారు తగ్గించలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే.. మోడీకి ఇంట(సొంత దేశం) సెగ మాత్రం తగులుతూనే ఉంది. అయితే.. మరోవైపు.. అంతర్జాతీయంగా మాత్రం ఆయనకు పురస్కారాలు లభిస్తున్నాయి. తాజాగా కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మక పురస్కారం .. ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ దక్కింది. ఇది సాధారణంగా ఎవరికి ఇవ్వరు. పాలనలో మెరుపులు.. దౌత్య సంబంధాల్లో పక్కా వ్యూహాలు అనుసరించేవారికిమాత్రమే ఇస్తారని కువైట్ వర్గాలు తెలిపాయి. అలాంటి పురస్కారం ప్రధాని మోడీకి దక్కింది. అంటే.. ఆయన రచ్చ గెలిచినట్టే!! కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఈ అవార్డును మోడీకి ఇచ్చారు.
ఎందుకు ఇచ్చారు?
ప్రతిష్టాత్మక కువైట్ పురస్కారం.. ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను ప్రధాని మోడీకి ఇవ్వడం వెనుక చాలానే రీజన్ ఉందని కువైట్ వెలువరించిన అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. “స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఈ పురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ తదితరులు దీన్ని అందుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి దశాబ్ద కాలంగా నేతృత్వం వహిస్తున్న ప్రధాని మోడీకి ఈ పురస్కారం ఇవ్వడం ముదావహమని.. భావిస్తున్నాం. దీనివల్ల పురస్కారానికి సార్థకత లభించింది” అని కువైట్ వెలువరించిన ప్రకటనలో పేర్కొంది. కాగా.. ప్రధాని మోడీకి ఈ పదేళ్ల కాలంలో మొత్తం 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.