తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో లైవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో పుంజుకుంటోంది. ఇక, తమిళనాడు, కర్ణాటకలోనూ మంచి సభ్యత్వం ఉంది. ఇప్పుడు ఈ పార్టీ అడుగులు దేశ రాజధాని ఢిల్లీ వైపుపడుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఢిల్లీలోనూ ప్రారంభమైంది. ఇలా.. దక్షిణాదికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజధానిలో సభ్యత్వం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత టీడీపీకే దక్కింది.
ప్రస్తుతం పార్లమెంటు స్థాయిలోనే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కీలక కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడో సారి కేంద్రంలో చక్రం తిప్పేందుకు.. టీడీపీ కీలకమేనన్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమిలో కీలక భూమిక కూడా పోషిస్తోంది. ఈ క్రమంలో దేశరాజధానిలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దాదాపు 500 మంది ఆదివారం ఒక్కరోజేపార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరికి పార్టీ నాయకులు గుర్తింపు కార్డుతోపాటు.. టీడీపీ కండువాను అందించారు.
టుగెదర్ ప్రోగ్రెస్-టుగెదర్ విత్ టీడీపీ.. పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సదరన్ ట్రావెల్స్ అధినేత, టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 500 మందికిపైగానే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఒక్కొక్కరు రూ.100 చెల్లించి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దేశవ్యాప్తంగా వినిపిస్తామన్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
రూ.100 చెల్లించి.. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమాతో పాటు.. చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా బీమా రూపం లో అందుతాయని ఆలపాటి వివరించారు. వచ్చే రెండు వారాల పాటు క్యాంపులు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వనున్నట్టు వివరించారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారి నుంచి భారీ స్పందన వస్తున్నట్టు వివరించారు.