ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతోపాటు.. పూల కుండీలు కూడా ధ్వంసమయ్యాయని తెలిసింది. ఇక, ఈ వ్యవహారంపై అల్లు అరవింద్ స్పందించారు. తమ ఇంటి ముందు జరిగిన ఆందోళనను అందరూ చూశారని.. ఇలాంటి ఘటనలు జరగడం సరికాదని అన్నారు. ఎవరూ తొందరపాటు చర్యలకు దిగరాదని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరరూ సంయమనం పాటించాలని అరవింద్ కోరారు. “అందరూ సంయమనం పాటించాలి… అదే మంచిది“ అని వ్యాఖ్యానించారు.
ఇక, తమ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అరవింద్ తెలిపారు. ఘటనను వారు కూడా పరిశీలించారని అన్నారు. ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తాము ఏం మాట్లాడినా ఇబ్బందే అవుతుందని చెప్పారు. అయినా.. తప్పడం లేదన్నారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. మరోవైపు.. ఈ దాడి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. దీనిని తాను ఖండిస్తున్నానని తెలిపారు.
అయితే..ఎక్కడా పేరు చెప్పకుండా.. ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా.. అని మాత్రమే రేవంత్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇలాంటి చర్యల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆయన ట్యాగ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా ఉండాలని.. తెలిపారు. మరోవైపు.. సంధ్య ధియేటర్ వద్ద ఈ నెల 4న జరిగిన ఘటనలో సంబంధం లేని పోలీసులు స్పందించడంపైనా సీఎం రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనతో సంబంధం లేని పోలీసులు మీడియా ముందుకురాకుండా చర్యలు తీసుకోవాలని.. కూడా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.