ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై కామెంట్ చేశారు. ఎవ‌రైనా చ‌ట్టం ముందు స‌మాన‌మేన‌ని చెప్పా రు. బాధితుల ప‌క్షానే పోలీసులు, ప్ర‌భుత్వం కూడా ఉంటాయ‌ని తెలిపారు. త‌మ‌కు ఎవ‌రిపైనా ప‌క్ష‌పాతం ఉండ‌ద‌ని చెప్పారు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న విష‌యంలో తాము ఎవ‌రికీ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని.. సంధ్య థియేట‌ర్ అనుమ‌తి కోరినా.. ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న అధికారులు అనుమ‌తులు ఇవ్వ‌లేద‌న్నారు.

హీరోలు.. స్థానిక ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవాల‌ని.. డీజీపీ సూచించారు. ఉన్న‌త స్థాయిలో ఉన్న‌వారు త‌మ గౌర‌వానికి, హుందాత‌నానికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌ని సూచించారు. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంధ్య ధియేట‌ర్ విష‌యంలో ఇప్ప టికే కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఈ కేసు హైకోర్టు ప‌రిధిలో ఉంద‌ని డీజీపీ వ్యాఖ్యానించారు. త‌మ‌కు రాజ‌కీయాలను అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌న్నారు.

ఇక‌, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కుటుంబ ర‌గ‌డ విష‌యాన్ని ప్ర‌స్తావించిన డీజీపీ జితేంద్ర .. అది వారి కుటుంబ స‌మ‌స్య‌గా పేర్కొన్నారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌తో వారు ప‌రిష్క‌రించుకుంటే మంచిదేన‌ని చెప్పారు. కానీ.. చ‌ట్ట ప్ర‌కారం.. ఎవ‌రు వ‌చ్చినా తాము ర‌క్ష‌ణ క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఇంటి స‌మ‌స్యల కు పోలీసులు బాధ్య‌త వ‌హించ‌బోర‌ని.. కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుంద‌ని జితేంద్ర స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి విష‌యానికీ పోలీసుల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.