ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని ప‌ద్ద‌తులు ఉంటాయి. ప్ర‌త్యేకంగా.. ఈ రోజు ఇదే ప‌ని జ‌ర‌గాల‌ని కానీ.. ఈ వారం ఈ ప‌నిపైనే కాన్స‌న్‌ట్రేష‌న్ చేయాల‌ని కానీ.. నిర్ణ‌యించుకున్న నిర్దేశించుకున్న ప్ర‌బుత్వాలు చాలా త‌క్కువ‌.

కానీ, ఎక్క‌డైనా ప‌రిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. కూట‌మి ప్ర‌భుత్వ సార‌థి.. సీఎం చంద్ర‌బాబు వారాల‌కు కూడా ప‌నిక‌ల్పిస్తున్నారు.

ఈ వారం ఈ ప‌నిచేయాల‌ని.. ఈ రోజు ఈప‌నికి స‌మ‌యం కేటాయించాల‌ని తాను నిర్ణ‌యించుకోవ‌డ‌మే కాదు.. త‌ప్ప‌కుండా ఆప‌నిచేయాల‌న్న‌ది కూడా ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌. మ‌రీ ముఖ్యంగా మంత్రులు కూడా ఈ రోజు త‌ప్ప‌ని స‌రిగా ఈ నిర్దిష్ట‌మైన ప‌నికే స‌మ‌యం ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించేలా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికి సోమ‌వారం నాడు.. పోల‌వారంగా మార్చుకున్నారు.

అంటే ప్ర‌తి సోమ‌వారం నాడు సీఎం చంద్ర‌బాబు, సంబంధిత మంత్రులు ఖ‌చ్చితంగా పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించి.. ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఇది వ‌చ్చే నెల నుంచి అమ‌లు కానుంది. ఇక‌, ప్ర‌తి మంగ‌ళ‌వారం కూడా.. సీఎం చంద్ర‌బాబు గ్రీవెన్స్‌లో పాల్గొంటారు.

పార్టీ కార్యాల‌య‌మైనా.. సీఎంవో అయి నా.. ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు. ఇక‌, బుధ‌వారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ప్ర‌తి రెండో శ‌నివారం.. స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. అదేవిధంగా ప్ర‌తి మొద‌టి, మూడో గురువారాల్లో కేబినెట్ స‌మావేశాలు నిర్వ‌హించ నున్నారు. ఇలా.. ప్ర‌తి వారానీ సీఎం చంద్ర‌బాబు నిర్దిష్ట‌మైన ప‌ని క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం.

ఆ వారాల్లో ఖ‌చ్చిత‌మైన టైం టేబుల్ పాటించ‌నున్నారు. దీంతో పాల‌న స‌జావుగా సాగుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. గ‌తంలోనూ ఇలానే చంద్ర‌బాబు ఒక టైంటేబుల్ ప్ర‌కారం పాల‌న సాగించిన విష‌యం తెలిసిందే.