అమ‌రావ‌తి ప‌రుగులో అడ్డుపుల్ల‌లు.. ఏం జ‌రుగుతోంది?

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌హా కూట‌మి స‌ర్కారు అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువ‌గా కాన్స‌న్‌ట్రేష‌న్ రాజ‌ధానిపైనే చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ నిర్మాణాల‌ను పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే సుమారు 15 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అప్పులు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వీటికి సంబంధించి అతి క‌ష్టం మీద ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల‌ను కూడా ఒప్పించారు. దీంతో వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి.

ఆయా బ్యాంకులు కూడా.. తాజాగా రెండు రోజుల కిందట రుణాలు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేశాయి. ఏటా కొంత మొత్తం మేర‌కు ఆరేళ్ల పాటు 2030 డిసెంబ‌రు వ‌ర‌కు ఈ రుణాల‌ను అందిస్తాయి. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రిలో 350 కోట్ల రూపాయ‌లు సీఆర్డీఏ ఖాతాకు జ‌మ చేసేందుకు ప్ర‌పంచ బ్యాంకు సంసిద్ధ‌మైంది. ఇది స‌జావుగా సాగితే.. 2030 నాటికి రాజ‌ధాని నిర్మాణం దాదాపు పూర్తి అయ్యే అవ‌కాశం ఉంది.

అయితే.. అస‌లు సిస‌లు రాజ‌కీయాలు ఇప్పుడే తెర‌మీదికి వ‌చ్చాయి. అమ‌రావ‌తి ప‌రుగులో అడ్డుపుల్ల‌లు పెట్టే కార్య‌క్ర‌మాల‌కు ‘కొంద‌రు’ తెర‌దీశారు. 2015-19 మ‌ధ్య వైసీపీ అప్ప‌టి ఎమ్మెల్యే ఆళ్ల‌రామ‌కృష్ణారెడ్డి ప్ర‌పంచ బ్యాంకుకు లేఖలు రాసిన విష‌యం తెలిసిందే. “అప్పు ఇస్తున్నారు.. కానీ, జాగ్ర‌త్త‌.. ఇక్క‌డ అంతా అస్త‌వ్య‌స్తంగా ఉంద‌”ని అప్ప‌ట్లో రామ‌కృష్ణారెడ్డి రాసిన లేఖ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. దీంతో ప్ర‌పంచ బ్యాంకు అప్ప‌టి వ‌ర‌కు ఇస్తాన‌న్న అప్పు విష‌యం వెన‌క్కి త‌గ్గి.. క్షేత్ర‌స్థాయిలో స‌ర్వే చేసింది. ఇంతలో స‌ర్కారు మారిపోయింది.

ఇక‌, ఇప్పుడు కూడా.. ఇలాంటి శ‌క్తులే.,. రాజ‌ధాని రుణానికి అడ్డు త‌గులుతున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. పేరు లేని ఓ లేఖ ప్ర‌పంచ బ్యాంకుకు చేరిన‌ట్టు రాజ‌ధాని ప్రాంతంలో చ‌ర్చించుకుంటున్నారు. ఈ లేఖ‌లో రాజ‌ధాని నిర్మాణానికి అమ‌రావ‌తి సుర‌క్షిత ప్రాంతం కాద‌ని, రైతుల‌ను మోసం చేసి భూములు తీసుకున్నార‌ని.. వారికి ఇస్తామ‌న్న నిధులు కూడా ఇవ్వ‌లేద‌ని.. పేర్కొన్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా రైతులు త‌మ భూములు త‌మకు ఇవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్టు కూడా పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుని ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఇప్పుడు..చంద్ర‌బాబుపై ప‌డింద‌నే చెప్పాలి.