కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. ఊరూ వాడా తిరుగుతూ.. ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు అభ్య‌ర్థుల‌ను కూడా ఖరారు చేస్తున్నా రు. త‌న‌ను జైలులో పెట్టిన తీరు నుంచి త‌న‌పై జ‌రిగిన దాడి(ప్ర‌చారంలో ఓ వ్య‌క్తి యాసిడ్ వంటి ద్రావ‌ణాన్ని పోశాడు), కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీరు వంటివి ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలో రెండేళ్ల కింద‌ట వెలుగు చూసిన‌.. లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించి.. ఇప్పుడు ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌ర్(ఈడీ) కూడా ఆయ‌న‌ను విచారించేందుకు రంగం రెడీ అయింది. ఈ కేసులో భారీ ఎత్తున మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని.. దీనిలో కేజ్రీవాల్ పాత్ర ఉంద‌ని ఈడీ కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను విచారించేందుకు.. రెండు మాసాల కింద‌టే సిద్ధ‌మైంది.

అయితే.. కేజ్రీవాల్‌ను విచారించేందుకు రాష్ట్ర లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా అనుమ‌తి అవ‌స‌రం. కానీ, రెండు మాసాలుగా ఆయ‌న అనుమ‌తి ఇచ్చేందుకు తొక్కి పెట్టారు. ఇప్పుడు స‌రిగ్గా.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేజ్రీవాల్ బిజీగా ఉండ‌డం.. అభ్య‌ర్థుల‌ను కూడా ఖ‌రారు చేసిన నేప‌థ్యంలో అనూహ్యంగా శ‌నివారం ఉద‌యం అనుమ‌తి ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రులు, మంత్రుల‌ను ప్ర‌శ్నించేందుకు 17 ఏ సెక్ష‌న్‌(సీఆర్ పీసీ) ప్ర‌కారం.. గ‌వ‌ర్న‌ర్‌ల అనుమ‌తి అవ‌స‌రం. ఇప్పుడు అదే జ‌రిగింది.

ఇప్పుడు ఏమ‌వుతుంది?

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా అనుమ‌తి ఇవ్వ‌డంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగ‌నున్నారు. కేజ్రీవాల్ ను ప్ర‌శ్నించ‌నున్నారు. విష‌యం ఇంత వ‌ర‌కు అయితే.. ఫ‌ర్వాలేదు. కానీ, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఢిల్లీలో బ‌ల‌మైన గ‌ళం ఒక్క కేజ్రీవాల్‌దే వినిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఉచిత హామీలు ఇవ్వ‌డంతోపాటు.. వారిని చేరువ అవుతున్నారు. ఈ క్ర‌మంలో కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగించేలా.. వ్యూహాత్మ‌క అడుగులు ప‌డుతున్నాయ‌న్న‌ది జాతీయ మీడియా వాద‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.