రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు! కాబట్టి మహిళల స్వావలంబన కోసం వీటిని మూడు దశాబ్దాల కిందటే ఏర్పాటు చేశారు. దీంతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో డ్వాక్రా సంఘాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఆర్థికంగా ప్రభుత్వం వీరిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు వినూత్న ఆలోచన చేసింది. మహిళా గ్రూపుల మాదిరిగానే డ్వాక్రా పురుష గ్రూపులను(వీటిని కామన్ ఇంట్రస్ట్ గ్రూప్(సీఐజీ)గా పిలుస్తారు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వినూత్న ఆలచన ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అమలు చేస్తున్నారు. పురుష గ్రూపులకు కూడా.. మహిళల గ్రూపుల మాదిరిగానే.. ఆర్థిక సాయం అందిస్తారు. వారిని కూడా సంఘాలుగా ఏర్పాటు చేయించి వారితో పొదుపు చేయిస్తారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు. తొలివిడతగా అనకాపల్లి జిల్లాలో 28 గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుని.. 20 గ్రూపులను గుర్తించారు. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు.
10 మంది మహిళలతో డ్వాక్రా గ్రూపులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. వీరికి బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి.. సక్రమంగా చెల్లించే వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు. ఎలాంటి ష్యూరిటీ లేకుండానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ తరహాలోనే పురుష గ్రూపులకు కూడా రుణాలు ఇప్పించి వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని నిర్ణయించారు. తొలివిడతలో రూ. 75 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇచ్చేలా సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే రుణ మొత్తాన్ని పెంచనున్నారు. దీనివల్ల వ్యాపారాలు వృద్ధి చెందడంతోపాటు.. నిరుద్యోగ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అంచనా వేశారు.
ఎవరు అర్హులు..?
భవన నిర్మాణ కార్మికులు, రిక్షా కార్మికులు, వాచ్‌మెన్లు, జొమాటో, సిగ్వీ డెలివరీ బాయ్స్, ప్రైవేటుగా పనిచేస్తువారు ఇలా ఎవరైనా 18 ఏళ్ల నిండి 60 ఏళ్ల లోపు ఉన్న పురుషులు కామన్ ఇంట్రస్టు గ్రూపు (సీఐజీ)లో చేరేందుకు అర్హులు. అయితే.. మహిళల మాదిరి.. పది మంది కాకుండా.. కేవలం ఐదుగురితోనే సీఐజీ గ్రుపులను రన్ చేయనున్నారు. మొత్తానికి చంద్రబాబు వినూత్న ఐడియా బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది సక్సెస్ అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి గ్రూపులను ప్రోత్సహించనున్నారు.