దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎంతో మంది నాయకులుతమకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి మరిచారు. అయినా సరే గిరిజనులు మాత్రం పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకంగా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు పవన్ ఈరోజు శ్రీకారం చుట్టారు.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రూ.49.73 కోట్లతో 9 గిరిజన ప్రాంతాల్లో 48 కి.మీ.ల మేర రోడ్డు పనులకు పవన్ నేడు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కి 500 కోట్లు ఖర్చుపెట్టిందని, కానీ, గిరిజన ప్రాంతాల్లో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయిందని పవన్ విమర్శించారు. కిలోమీటర్ నడిస్తేగానీ గిరిజనుల సమస్యలు తెలియవనే ఉద్దేశంతో కలెక్టర్ వర్షం పడుతోందని చెప్పినా కూడా వినకుండా నడుచుకుంటూ వచ్చానని అన్నారు.
డోలీలలో గర్భిణిని తీసుకురావడానికి ఎంత ఇబ్బందిపడతారనేదీ తెలియాలనే తాను కూడా నడిచానని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చమని కోరేందుకు తిరుమల కొండ ఎక్కానని, గిరిజనుల కష్టాలు తెలుసుకునేందుకు, వాటిని తీర్చేందుకు ఈ కొండ ఎక్కానని పవన్ అన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై 2 నెలలకు ఒకసారి ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రకటిస్తానని ప్రకటించారు. 2027 లోపు ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు.
డోలీలో చనిపోయింది నా అక్కా చెల్లెళ్ళు అని భావించానని అన్నారు. ఇకపై ఆ డోలి కష్టాలకు చెల్లు చీటీ పడాలని, భవిష్యత్తులో ఎవరు ఆ విధంగా చనిపోకూడదని తాను ఇక్కడికి వచ్చాను అని పవన్ అన్నారు.2019లో తనను ఓడించారని, నాయకుడిగా నేను నిలబడతానో లేదో అని తనను మన్యం ప్రజలు పరీక్షించారని గాజువాక ఓటమి గురించి పవన్ మాట్లాడారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు స్వయంగా వచ్చిన పవన్ కళ్యాణ్ పై గిరిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ నాయకుడు తమను పట్టించుకోలేదని, ఈ మహానుభావుడు వచ్చాడని గిరిజన మహిళలు చెబుతున్న మాటలు వైరల్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates