ఇచ్చిన మాట కోసం: నారా భువ‌నేశ్వ‌రి టూర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. 4 రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం.. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పానికి వ‌చ్చారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆమె కేవ‌లం ఒక చోట కూర్చోకుండా.. మొత్తంగా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని 12 గ్రామాల్లోనూ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసేలా షెడ్యూల్ నిర్ణ‌యిం చుకున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు.. నారా భువ‌నేశ్వ‌రి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును మ‌ళ్లీ గెలిపించాల‌ని ఆమె విన్న‌వించారు.

అంతేకాదు.. ఎక్కువ మెజారిటీ వ‌చ్చిన మండ‌లాల‌ను తాను ద‌త్తత తీసుకుని.. అభివృద్ధి చేస్తాన‌ని మాటిచ్చారు. ఆమె ఇచ్చిన పిలుపును స్వీక‌రించిన ఓట‌ర్లు.. నారా చంద్ర‌బాబును భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్ర‌మంలో కుప్పంపై నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. కూట‌మి స‌ర్కారు ప‌గ్గాలుచేప‌ట్టిన త‌ర్వాత‌.. వ‌రుస‌గా ఆమె కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు మాసాల కింద‌ట భువ‌నేశ్వ‌రి కుప్పంలో ప‌ర్య‌టించారు. తాజాగా మ‌రోసారి 4 రోజుల షెడ్యూల్‌తో ఆమె కుప్పానికి వెళ్లారు.

అయితే.. ఈ సారి నారా భువ‌నేశ్వ‌రి పెద్ద ప్ర‌ణాళిక‌తోనే కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. మొత్తంగా 12 గ్రామాల్లో ఆమె ప‌ర్య‌టించి.. అభివృద్ధికి సంబంధించిన ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. 4 రోజుల్లో 12 గ్రామాల‌ను చుట్టి వ‌చ్చేలా ప్ర‌ణాళిక రెడీ చేసుకున్నారు. మ‌రీముఖ్యంగా మ‌హిళ‌ల ఆర్థిక బ‌లోపేతానికి కృషి చేస్తాన‌న్న ఆమె.. దానికి అనుగుణంగా ప్ర‌త్యేక శిక్ష‌ణ కేంద్రాల ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. ఎన్టీఆర్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఈ శిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

కుప్పం మండలం వెంగాటుపల్లి గ్రామం, అడవి బూదుగూరు గ్రామం, గుండ్ల మడుగు, డీకే పల్లిలో మహిళలతో ముచ్చటించి వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. వారికి మెరుగైన జీవ‌నోపాధుల క‌ల్ప‌న‌తో పాటు.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌పైనా నారా భువ‌నేశ్వ‌రి దృష్టి పెట్ట‌నున్నారు. ఆర్థికంగా బ‌లోపేతానికి కృషి చేయ‌నున్నారు. అయితే.. నారా భువ‌నేశ్వ‌రి ఇలా తొలిసారి కుప్పంపై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డంతో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా అలెర్ట్ అయ్యారు.