వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, కొన్నిసార్లు తన దూకుడుకు కళ్లెం వేయలేక అంబటి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఇదే దూకుడు చూపించిన అంబటిపై గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. తాము ఇచ్చిన కంప్లయింట్ లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ పట్టాభిపురం పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగడంతో ఆయనపై కేసు నమోదైంది.
ప్రతిపక్ష హోదా లేకపోయినా, అధికార పార్టీ కాకపోయినా అంబటి మాత్రం తగ్గేదేలే అంటూ తన అనుచరులతో కలిసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రచ్చ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఖాతాలపై, పోస్టులపై తాము ఇచ్చిన ఫిర్యాదుల సంగతేంటో తేల్చాలని అంబటి పట్టుబట్టారు. ఆ ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పినా అంబటి వినలేదు. అంతేకాకుండా, తన అనుచరులతో కలిసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మెట్లపై అనుచరులతో బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని నానా రభస చేశారు. తమ విధులకు ఆటంకం కలుగిస్తున్నారని చెప్పినా అంబటి అండ్ కో వినలేదు. దీంతో, అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అంబటి ధర్నా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.