పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో సారంగి కిందపడి తలకు గాయమైంది. సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆ ఎంపీ నా మీదకు వచ్చి పడ్డాడు. అదే సమయంలో నేనూ కిందపడి గాయపడ్డాను,” అని ఆరోపించారు. బీజేపీ వర్గాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, రాహుల్ గాంధీ తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆయన మాట్లాడుతూ, “సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మా తప్పేమీ లేదు,” అని స్పష్టం చేశారు. ఆయన వీడియో ఫుటేజీ పరిశీలించి నిజాలు బయటపెట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. బీజేపీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాహుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ ఘటనతో పార్లమెంట్ వేదిక మరింత వివాదాస్పదంగా మారింది.