దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన.. అందరూ విచారించాల్సిన ఘటన చోటు చేసుకుంది. భారత పార్లమెంటు ముందు.. భవనం పైకి కూడా ఎక్కి అధికార-ప్రతిపక్షాల సభ్యులు పోటా పోటీగా నిరసనకు, ఆందోళనకు దిగారు. ఇలా జరగడం 75 సంవత్సరాల పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా ప్రభుత్వ పక్షాన్ని విమర్శిస్తూ.. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతాయి.
కానీ, ఈ సారి మాత్రం దీనికి విరుద్ధంగా అధికార పక్షమే.. ఆందోళనకు దిగిపోయి.. పార్లమెంటు ముందు రోడ్డెక్కింది. అసలు ఏం జరిగిందంటే.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌ను మీరు అవమానించారంటే మీరు అవమానించారంటూ అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్ష ఇండీ కూటమి పార్లమెంటు సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పార్లమెంటు వెలుపల ఇరు పక్షాలకు చెందిన సభ్యులు పోటా పోటీగా నిరసన చేపట్టారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ముందు ఆందోళన చేశారు. అదేవిధంగా అధికార పక్షం బీజేపీ సభ్యులు కూడా.. పార్లమెంటు ముందు నిరసనకు దిగి.. కాంగ్రెస్ పార్టీనే బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానించిందని నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ సభ్యుల తీరును బీజేపీ సభ్యులు ఎండగట్టారు. దీంతో ఉభయ సభల్లోనూ ఎలాంటి కార్యక్రమాలూ జరగలేదు.
రాహుల్-ప్రియాంక ఏం చేశారంటే..
ఇండీ కూటమిలో కీలక నాయకులుగా ఉన్నరాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.. గురువారం బ్లూ కలర్ దుస్తులు ధరించి వచ్చారు. నిరసనలకు నేతృత్వం వహించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని.. బీజేపీకి ముఖ్యంగా అమిత్‌షాకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండీ కూటమి నాయకులను ముందుండి నడిపించారు.