వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంలో కాకుండా.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలో క‌నుక ఇండియా కూట‌మి ఉంటే.. త‌మ ఆలోచ‌న ఆదిశ‌గా మ‌ళ్ల‌డం త‌ప్పులేద‌ని కూడా చెప్పారు. దీంతో ఒక్క‌సారిగా వైసీపీ వైఖ‌రిపై చ‌ర్చ సాగింది.

ఇండియా కూట‌మిలోకి వెళ్ల‌డం త‌ప్పుకాద‌ని.. మెజారిటీ నాయ‌కులు, విశ్లేషకులు కూడా చెప్పుకొచ్చారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌పై కేసులు ఉండ‌డం.. కేంద్రంలోని బీజేపీతో త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీ చెలిమి చేస్తున్న క్ర‌మంలో జ‌గ‌న్‌.. ఇండియా కూట‌మివైపు మ‌ళ్ల‌డం స‌మంజ‌స‌మేన‌ని చెప్పుకొచ్చారు. కేసులు క‌నుక తీవ్రత పెరిగితే.. జాతీయ‌స్థాయిలో జ‌గ‌న్‌ను కాపాడేందుకు.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు కూడా.. కూట‌మి నాయ‌కులు రెడీగానే ఉన్నార‌ని గ‌తాన్ని గుర్తు చేశారు.

దీంతో బీజేపీ అగ్ర‌నాయ‌కులు కూడా జ‌గ‌న్ వైఖ‌రి, వైసీపీ ఎంపీల ప‌నితీరు.. వారు ఎవ‌రిని క‌లుస్తున్నారు? ఎవ‌రితో మంత‌నాలు జ‌రుపుతున్నార‌న్న విష‌యంపై దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. ఇండియా కూట‌మితో చెలిమికి వైసీపీ రెడీ అవుతోంద‌న్న సంకేతాలు వ‌స్తున్న త‌రుణంలోనే.. రాష్ట్రంలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల నుంచి దూకుడు త‌గ్గింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అన్న‌ను టార్గెట్ చేసిన ష‌ర్మిల సంచ‌ల‌నం సృష్టించారు. కానీ, తాజా ప‌రిణామాల‌తో ఆమె సైలెంట్ అయ్యారు.

ఇంత జ‌రుగుతున్న క్ర‌మంలో అనూహ్యంగా వైసీపీ యూట‌ర్న్ తీసుకుంది.. తాజాగా పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన జ‌మిలి ఎన్నిక‌ల బిల్లుకు.. ఎవ‌రూ కోర‌కుండానే.. మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అంతేకాదు.. బీజేపీ మిత్ర‌ప‌క్షం.. టీడీపీ కంటే కూడా ముందే.. వైసీపీ ఎంపీలు.. దీనికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నిజానికి బీజేపీకి మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న చాలా పార్టీలు ఈ విష‌యంలో సందేహాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

కానీ, వైసీపీ మాత్రం.. ఇలా బిల్లు ప్ర‌వేశ పెట్ట‌గానే.. అలా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేసింది. దీంతో ఇండియా కూట‌మి నాయ‌కులు అవాక్క‌య్యారు. అస‌లు వైసీపీ ఎటు అడుగు వేస్తోంద‌న్న‌ది వారికి కూడా విస్మ‌యం క‌లిగించింది. మొత్తంగా.. రెండు ప‌డ‌వ‌ల‌పై జ‌గ‌న్ కాళ్లు వేస్తున్నారా? దిశానిర్దేశం విష‌యంలో త‌డ‌బ‌డుతున్నారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇదే జ‌రిగితే.. ఎటూ కాకుండా పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.