లోక్ స‌భ‌లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు

ఒకే దేశం-ఒకే ఎన్నిక‌ల బిల్లు లోక్‌స‌భ ముందుకు వ‌చ్చింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌.. మంగ‌ళ‌వారం జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 129వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఈ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు తెలిపారు. దేశంలో ఒకే సారి లోక్‌స‌భ‌, రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా ఖ‌జానాపై భారం త‌గ్గుతుంద‌ని.. అదేవిధంగా పాల‌నా వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి, తెలుగు దేశం పార్టీ స‌భ్యుడు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును స్వాగ‌తిస్తున్న‌ట్టు తెలిపారు. జాతి నిర్మాణానికి ఈ బిల్లు దోహ‌ద ప‌డుతుంద‌ని చెప్పారు. కాగా.. ఈ బిల్లును ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ, స‌మాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ త‌దిత‌ర పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. ప‌లువురు స‌భ్యులు మాట్లాడుతూ.. ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి మ‌రిన్ని అధికారాలు ఇచ్చిన‌ట్టేన‌ని తెలిపారు.

అధికార ప‌క్షానికి స‌భ‌లో మూడింట రెండు వంతుల మంది స‌భ్యుల‌ మ‌ద్ద‌తు లేన‌ప్పుడు ఈ బిల్లును ఎలా తీసుకువ‌స్తార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ధానంగా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్య‌తిరేకించిం ది. వ‌చ్చే ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో తృణ‌మూల్ స‌భ్యులు వ్య‌తిరేకించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఎన్డీయే కూట‌మిలోని జేడీయూ, జేడీఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు. ఇక‌, బీజేపీ స‌భ్యులు మాత్రం ప్ర‌తిప‌క్షాల వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు.

ప్ర‌తి బిల్లును అడ్డుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్ష స‌భ్యులు విమ‌ర్శించారు. దీనిపై చ‌ర్చ సాగుతుంద‌ని.. జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీని కూడా ఏర్పాటు చేస్తామ‌ని బీజేపీ స‌భ్యులు తెలిపారు. అయితే.. అస‌లు స‌భ‌లో అధికార ప‌క్షానికి బ‌లం లేన‌ప్పుడు.. ఈ బిల్లును తీసుకురావ‌డంలో ఔచిత్యం ఏంటని కాంగ్రెస్ స‌భ్యులు నిల‌దీశారు. మొత్తంగా లోక్‌స‌భ‌లో పెద్ద ఎత్తున దుమారం రేగింది.