ఇప్పటి వరకు పార్టీ నుంచి వెళ్లిపోతున్నవారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అడ్డుకోలేదు. వారికి ఎక్కడా.. బ్రేకులు వేయలేదు. కనీసం చర్చించనూ లేదు. దీంతో చాలా మంది నాయకులు పార్టీకి జల్ల కొట్టి జంప్ చేసేశారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు సొంత జిల్లాలోనే పెద్ద కుంపటి రాజుకుంటోంది. వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయి.
ఇది పక్కా వాస్తవం. ప్రస్తుతం కడప కార్పొరేషన్ పరిధిలో వైసీపీనే రాజ్యం చేస్తోంది. ఇక్కడ గుండుగుత్తగా .. వైసీపీకి చెందిన కార్పొరేటర్లే ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరిలో సగం మందిని తీసుకుని.. కడప కార్పొరేషన్‌పై ఆధిపత్యం సాధించాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. దీనికి చంద్రబాబు ఆదేశా లు ఉన్నాయా? లేవా? లోకల్ నాయకులే ఇలా చేస్తున్నారా? అంటే.. విషయం ఏదైనా కూడా.. మొత్తానికి ఇక్కడి వారు మార్పు దిశగా అడుగులు వేయడం కనిపిస్తోంది.
ఇప్పటికే సగం మంది కార్పొరేటర్లు కండువాలు మార్చుకునేందుకు రెడీ అయ్యారు. వీరిలోనూ ఏడుగురు నేడో రేపో సైకిల్ ఎక్కనున్నారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో మరోవైపు.. బీజేపీ నేతలు కూడామి గిలిన వారిని తమవైపు తిప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ కాన్సెప్టు ఒక్కటే. ఎవరు ఏ పార్టీలోకి వచ్చారన్నది ముఖ్యం కాదు. కార్పొరేషన్‌ను కూటమి కైవసం చేసుకోవడమే లక్ష్యం అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అలెర్ట్ అయితే అయింది.
ఎంపీ అవినాష్ రెడ్డి తమ పార్టీ కార్పొరేటర్లతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. కానీ, ఎక్కడా ఆయన చర్చలు ఫలించడం లేదు. జగన్ వచ్చి తమకు హామీ ఇస్తే తప్ప.. తమ నిర్ణయం మార్చుకోబోమ ని చాలా మంది తేల్చి చెబుతున్నారు. గత వైసీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి తమకు ఇంకా సొమ్ములు రావాల్సి ఉందని.. పార్టీ మారితే ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా రెడీ అవుతోందని వారు చెబుతున్నట్టు తెలిసింది.
వీరిని సర్దు బాటు చేయలేక అవినాష్‌రెడ్డి ఆపశోపాలు పడుతున్నారు. మరోవైపు సాగునీటి సంఘాల ఎన్నికలను కూడా.. అవినాష్‌రెడ్డికే అప్పగించిన జగన్.. తాను బెంగళూరుకు వెళ్లిపోయారు. ఫలితంగా పులివెందులలో సాగునీటి సంఘాలు అన్నీ కూటమికే దక్కాయి. మరి ఇప్పుడైనా.. జగన్ స్పందించి.. కార్పొరేటర్లకు అభయం ఇస్తారో లేదో చూడాలి.