మ‌కాం మార్చేసిన చెవిరెడ్డి .. !

వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు.. చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌న మ‌కాం మార్చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయం.. ఒంగోలు కేంద్రంగానే సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న బాలినేని శ్రీనివాస‌రావు కార‌ణంగా.. కొంత దూకుడు త‌గ్గించిన చెవిరెడ్డి.. బాలినేని జ‌న‌సేన‌లోకి జంప్ చేయడంతో త‌న దూకుడు పెంచారు. వైసీపీ నేత‌ల‌ను త‌న దారిలోకి తెచ్చుకున్నారు. అయితే.. ఇలా చెవిరెడ్డి మ‌కాం మార్చేయ‌డంతో చంద్ర‌గిరిలో వైసీపీ ప‌ట్టు త‌ప్పుతోంది.

తాజాగా చంద్ర‌గిరిలో జ‌రిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో కూటమి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ అభ్యర్థుల విజయకేతనం స్ప‌ష్టంగా క‌నిపించింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నేతృత్వంలో ఇక్క‌డి ఎన్నిక‌లు ఏక‌ప‌క్షంగా సాగిపోయాయి. తిరుపతి రూరల్ మండలంలోని సాగునీటి సంఘాల కమిటీ సభ్యులు గుండు గుత్త‌గా కూట‌మి వైపే నిల‌బ‌డ్డారు. అంద‌రూ నాని క‌నుస‌న్నల్లోనే ముందుకుసాగ‌డంతో విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది.

పార్టీలకు అతీతంగా ఇక్క‌డ కూట‌మి అభ్యర్థుల‌ను గెలిపించ‌డం వెనుక కూడా పులివ‌ర్తి మంత్రాంగం స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే.. చంద్ర‌గిరిలో చెవిరెడ్డి క‌నుక చ‌క్రం తిప్పి ఉంటే.. అక్క‌డ వేరే లెక్క‌లు ఉండేవ‌ని అంటున్నారు. కానీ, ఆయ‌న ఒంగోలులోనే మ‌కాం వేసి.. ఇక్క‌డి రాజ‌కీయాల‌నే త‌న గుప్పిట్లో ఉంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫ‌లితంగా చంద్ర‌గిరిలో రాజకీయాలు గాడి త‌ప్పుతున్నాయి. మ‌రో వైపు.. ఒంగోలులో కూడా ఇంకా ప‌ట్టు చిక్క‌లేద‌ని తెలుస్తోంది.

జ‌న‌సేన వైపే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. వైసీపీ లోని నాయ‌కుల‌ను జ‌న‌సేన‌లోకి వెళ్లకుండా చూసేందుకు చెవిరెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాలినేని వెంట త‌మ పార్టీ నాయ‌కులు చేర‌కుండా చూసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, ఎవ‌రూ కూడా చెవిరెడ్డి చెప్పింది వింటున్నారే త‌ప్ప‌.. మ‌న‌సు మాత్రం జ‌న‌సేన వైపే ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాను ఒంగోలు దాటి వెళ్తే.. మ‌రింత మంది పార్టీ నుంచి జంప్ చేస్తార‌న్న లెక్క‌లు వేసుకున్న చెవిరెడ్డి.. ఒంగోలులోనే మ‌కాం వేయ‌డం గ‌మ‌నార్హం.