మంద కృష్ణ‌కు ఘాటుగా ఇచ్చి ప‌డేసిన‌ సీఎం రేవంత్‌

తెలంగాణ‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేప‌డ‌తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అనేది కాంగ్రెస్ విధానాల్లో కీల‌క‌మైన‌ద‌ని పేర్కొన్నారు. తాజాగా ఆయ‌న ‘గ్లోబ‌ల్ మాదిగ స‌ద‌స్సు-2024’లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌మ ప్ర‌భుత్వం మాదిగ‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ గ‌త కొన్నాళ్లుగా త‌మ ప్ర‌భుత్వం పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను రేవంత్ రెడ్డి ప‌రోక్షంగా దుయ్య‌బ‌ట్టారు. ఎస్సీ ల‌లో మాదిగ సామాజిక వ‌ర్గం వెనుక‌బ‌డి ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిందే తామని ఆయ‌న పేర్కొన్నారు.

అందుకే.. చ‌రిత్ర‌లో తొలిసారి ఉస్మానియా యూనివ‌ర్సిటీకి వీసీగా మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్రొఫెస‌ర్‌ను నియ‌మించిన ఘ‌న‌త తాము ద‌క్కించుకున్న‌ట్టు వెల్ల‌డించారు. ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ విధానంపై సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు కాంగ్రెస్ అనేక రూపాల్లో త‌న వాద‌న‌ల‌ను వినిపించిన విష‌యాన్ని గుర్తు చేశారు. “కొంద‌రు అంటున్న‌రు.. మాదిగ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. అస‌లు మాదిగ‌ల గురించి మాట్లాడిందే మేము. మాదిగ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టులో మాదిగ‌ల విజ‌యం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించాలి” అని ప‌రోక్షంగా మంద కృష్ణ‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మాదిగల‌కు ప్రాధాన్యం ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున‌ట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీవ‌ర్గీక ర‌ణ‌పై నియ‌మించిన ష‌మీమ్ అక్త‌ర్ క‌మిష‌న్ నివేదిక త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని.. దీనిపై అభ్యంత‌రాలు స్వీక‌రించి.. సాధ్య‌మైనంత వేగంగా ఈ నివేదిక‌ను అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. “ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రాలు అవ‌స‌రం లేదు. మాది ఎస్సీ అనుకూల ప్ర‌భుత్వం. ఎస్సీలకు రాజ్యాంగ‌ఫ‌లాలు అందించాల‌న్న సంక‌ల్పంతోనే అనేక రూపాల్లో మా పార్టీ ప్ర‌య‌త్నం చేస్తోంది. క‌శ్మీరు నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు.. ఎస్సీల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు మా పోరాటం ఆగ‌దు” అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

రాష్ట్రం విష‌యానికి వ‌స్తే.. చెవెళ్ల‌లో ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ చేసిన తీర్మానానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని సీఎం చెప్పారు. రాజ‌కీయంగా, అధికారికంగా కూడా.. మాదిగ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. చేవెళ్ల డిక్ల‌రేష‌న్ ద్వారా.. కాంగ్రెస్ పార్టీ మాదిగ‌ల విష‌యంలో ఎలాంటి ప్ర‌య‌త్నం చేస్తోందో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే తేల్చి చెప్పార‌ని.. అయినా కొంద‌రు త‌మ‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే విమ‌ర్శిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇక‌,నైనా వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మాదిగ సోద‌రుల‌కు ఈ ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌న్నారు.