2025పై చంద్ర‌బాబు ‘బ్రాండ్‌’ ..!

2024.. టీడీపీకి ఒక మ‌ర‌పురాని సంవ‌త్స‌రం. బ‌ల‌మైన వైసీపీ పాల‌న‌ను తిప్పికొట్టి.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు మలుచుకుని.. కూట‌మి క‌ట్టి అధికారం ప‌ట్టిన సంవ‌త్స‌రం.. 2024. ఈ సంవ‌త్స‌రం .. నిజంగా పార్టీ ఆవిర్భ‌విం చిన త‌ర్వాత సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకున్న సంవ‌త్స‌రంగానే చెబుతారు త‌మ్ముళ్లు. ఎందుకంటే.. ప్ర‌తి ఐదేళ్లకు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఈ ఏడాది వ‌చ్చిన ఎన్నిక‌లు చాలా ప్ర‌త్యేకం. అనేక మ‌లుపులు.. అనేక స‌మ‌స్య‌లు.. అయినా.. వాటిని ఛేదించుకుని.. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో టీడీపీ కూట‌మి క‌ట్టి అధికారం ద‌క్కించుకుంది.

అయితే.. ఇక‌, మ‌రో 18 రోజుల్లో నూత‌న సంవ‌త్స‌రం 2025 అడుగు పెట్ట‌నుంది. ఇది మ‌రింత ప్ర‌త్యేకంగా మార‌నుంది. 2024 టీడీపీదైదే.. 2025 అచ్చంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2025పై చంద్ర‌బాబు బ్రాండ్ ఖ‌చ్చితంగా ప‌డుతుంద‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణం.. 2024 జూన్‌లో ప‌గ్గాలు చేప‌ట్టినా.. పాల‌న‌ను గాడిలో పెట్టేందుకే 4 నెల‌లు పూర్త‌య్యాయి. ఇక‌, మిగిలి రెండు మూడు మాసాలు కూడా.. వ్య‌వ‌స్థ‌ల‌ను స‌రిదిద్దేందుకు వాడుకున్నారు. ఈ స్వ‌ల్ప స‌మ‌యంలోనూ.. సూప‌ర్ 6 ను అమలు చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ, ప్ర‌ధానంగా ‘చంద్ర‌బాబు బ్రాండ్‌’ అయితే ఇది కాదు. అభివృద్ధి, ఐటీ.. ఈ రెండు ఆయ‌న బ్రాండ్లు. ఇప్పుడు చంద్ర‌బాబుకు వ‌చ్చే సంవ‌త్స‌ర‌మే అస‌లు సిస‌లు స‌మ‌యం. ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్కు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో వ‌చ్చే సంవ‌త్స‌రానికి బ‌ల‌మైన పునాదులు ప‌డ్డాయ‌నే చెప్పాలి. రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు.. ఐటీ రంగంలో విశాఖ నుంచి తిరుప‌తి వ‌ర‌కు, పెట్టుబ‌డుల రంగంలో క‌ర్నూలు నుంచివిజ‌య‌న‌గ‌రం వ‌ర‌కు.. ఇలా.. అనేక రంగాల‌లో పురోగ‌తికాదు.. ప్ర‌ధాన ప‌నులే వ‌డివ‌డిగా జ‌న‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌నున్నాయి.

ఇక‌, సూప‌ర్ 6లో కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను కూడా.. వ‌చ్చే ఏడాది రెండు అమలు చేయ‌నున్నారు. వీటిలో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఉచిత బ‌స్సులు, రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ వంటివి అమ‌లు చేస్తారు. అదేస‌మయంలో డీఎస్సీ నియామ‌కాలు.. ఐటీ రంగంలో ఉపాధి, మ‌హిళ‌ల స్వావ‌లంబ‌న దిశ‌గా తీసుకున్న నిర్ణ యాల‌ను కూడా.. వ‌చ్చే ఏడాది నుంచే ప‌రుగులు పెట్టించ‌నున్నారు. కాబ‌ట్టి.. వ‌చ్చే ఏడాది చంద్ర‌బాబుకు అత్యంత కీల‌కం. ఆయ‌న బ్రాండు పాల‌న‌కు 2025 స‌జీవ సాక్ష్యంగా నిల‌వ‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.