ఉపన్యాసాలు ఇస్తే గెలవం.. అంబటి వేదాంతం!

2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, చాలామంది వైసీపీ నేతలు లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. తక్కువలో తక్కువ 20వేల నుంచి మొదలుకొని లక్ష ఓట్ల మెజారిటీతో వైసిపి ఎమ్మెల్యేలు ఓటమిపాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

టీవీ డిబేట్లో మాట్లాడుతూ ప్రెస్ మీట్ లలో ఉపన్యాసాలు ఇస్తే కుదురుతుందా? నాకు 28 వేల ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పని చేయకుండా ఊరికే ఉపన్యాసాలు ఇస్తే టీవీలో మాట్లాడితే కుదిరిద్దా? కుదరదు. నేను బ్రహ్మాండంగా టీవీల్లో మాట్లాడుతాను…మొన్న 28,000 మైనస్ వచ్చింది……మామూలుగా కాదు నాకే ఏం చేయాలో అర్థం కాకుండా రెండు రోజులు బయటకు రాలేదు… అని అంబటి రాంబాబు అన్నారు.

అయితే తనకు తర్వాత ధైర్యం వచ్చిందని, ఇంకొకాయన 90వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని, వాళ్లకన్నా మనం బెటర్ అని అనుకున్నానని, ఆ తర్వాత ఇక్కడ 50,000 మెజారిటీతో ఓడిపోయారని తెలిసిందని చెప్పుకొచ్చారు. 28 వేలు అంటే టైట్ ఫైట్ ఇచ్చానని ఓ పెద్దాయన అన్నారాని తెలిపారు. ఇన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటూ 28 వేల మెజారిటీతో ఓడిపోతే టైట్ ఫైట్ ఏమిటి అనుకున్నానని, కానీ, మిగతా వాళ్ళ ఓటమి మార్జిన్ చూస్తే వారికన్నా బెటర్ కదా అని తాను తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.

2014లో 924 ఓట్లతో ఓడిపోయానని. అప్పట్లో నిద్రపట్టేది కాదని కానీ మొన్న నిద్ర పట్టిందని చెప్పారు. 28 వేల మెజార్టీతో ఓడిపోయినా సరే నిద్రపోయానని, ఏం చేసినా గెలిచి చచ్చే వాళ్ళం కాదులే అని అనిపించిందని రాంబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇదని, కాకపోతే అంబటి బయటపడ్డారని మిగతావారు బయటపడలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వైసిపి నేతల దుస్థితి చూసి వారిపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.