ఒకే కుటుంబంలో అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు అందరూ డాక్టర్లు లేదా ఇంజనీర్లు లేదా టీచర్లు.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండటం ఎన్నో సందర్భాలలో చూశాం. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. అయితే రాజకీయంగా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అవుతూ ఉండటం చూసాం.
చంద్రబాబు కుటుంబం దివంగత ఎర్రం న్నాయుడు కుటుంబం.. ఆదిరెడ్డి కుటుంబం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే టైంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు.. నలుగురు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి కూడా చెప్పుకోవాలి. చిరంజీవి కుటుంబం నుంచి టాలీవుడ్ లో చాలామంది హీరోలు అయ్యారు. చిరంజీవి స్వయంశక్తితో… స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు. ఆయన బాటలోనే తమ్ముళ్లు నాగబాబు – పవన్ కళ్యాణ్ ప్రయాణించారు.
ఆ తర్వాత చిరంజీవి వారసులు మేనల్లుళ్లు.. బావమరిది అల్లు అరవింద్ కుమారులు ఎలా ఒకరి తర్వాత ఒకరు సినిమాల్లోకి వచ్చి మెగా అండతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నాగబాబు హీరోగా సక్సెస్ కాలేదు.. నిర్మాతగాను సక్సెస్ కాలేదు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టీవీ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇదే క్రమంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతి – పాలకొల్లు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి పాలకొల్లులో ఓడి.. తిరుపతిలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అన్న పార్టీ పెట్టగానే తమ్ముళ్లు ఇద్దరు కూడా అందులో యాక్టివ్ రోల్ పోషించారు.
ఆ తర్వాత చిరు రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి టీడీపీతో పొత్తులో పోటీ చేసి పిఠాపురం ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఏపీ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక జనసేనలో కీలక పాత్ర పోషించిన మరో సోదరుడు నాగబాబు కూడా ఇప్పుడు మంత్రి కాబోతున్నారు. ఇలా సినిమా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముగ్గురు సొంత అన్నదమ్ములు కూడా మంత్రి అవ్వడం అరుదైన రికార్డ్. ఈ రికార్డు ఇండియన్ సినిమా చరిత్రలో మెగా కుటుంబం పేరు మీద లిఖించబోతోంది.