తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..సోమవారం(డిసెంబరు 9) నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయనుంది. అయితే.. ఈ సభల్లోనే రేవంత్‌రెడ్డి సర్కారును కడిగి పారేయాలని మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తికావడం.. కొన్ని సమస్యలను పరిష్కరించలేక పోవడం సహా.. లగచర్ల వంటి సరికొత్త సమస్యలు తెరమీదికి రావడం.. ఇప్పుడు కేసీఆర్ బృందానికి ఆయుధాలు ఇచ్చినట్టు అయింది.
ప్రధానంగా రైతులు..
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రైతులను కేంద్రంగా చేసుకుని బీఆర్ ఎస్ నిప్పులు చెరిగే అవకాశం కనిపిస్తోంది. రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పా్ర్టీ కొంత వరకు రుణ మాఫీ చేసినా.. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. జిల్లాలు, మండలాల వారీగా ఇటీవల బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ లెక్కలు తీసుకున్నారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని సభలో ఈ విషయంపై ప్రశ్నించడంతోపాటు.. అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అదేసమయంలో తమ హయాంలో అమలైన రైతు బంధును ప్రస్తావిస్తూ.. కౌంటర్ ఇవ్వనున్నారు.
ఇక, హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలను కూడా బీఆర్ ఎస్ ప్రధాన ఆయుధంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెట్టడంతోపాటు.. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల కుటుంబాలకు చెందిన వారి అక్రమ కట్టడాలను కూల్చకుండా.. తాత్సారం చేస్తున్నారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా.. ప్రస్తావించనున్నారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళన, పేదల ఇళ్ల కూల్చివేతలు.. ఈ దఫా సమావేశాలను వేడెక్కించనున్నాయి. అదేసమయంలో లగచర్లలో జరిగిన కలెక్టర్‌పై దాడి సహా.. పరస్పర కేసులు, పేదలనుఅరెస్టు చేయడం వంటివి కూడా సభను కుదిపేస్తాయని బీఆర్ ఎస్ వర్గీయులు చెబుతుండడం గమనార్హం.
వీటికితోడు.. ఉద్యోగాల కల్పన, కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేక పోవడం, పెట్టుబడులు, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు సహా.. అనేక అంశాలను ఈ సారి కేసీఆర్ బృందం టార్గెట్ చేయనుందని తెలుస్తోంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గిపోవడం పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా సభలో ప్రస్తావించి సర్కారును ఇరుకు పెట్టే ప్రయత్నం చేయొచ్చు. అయితే.. అధికార పక్షం కూడా.. గత ఏడాది కాలంలో తాము సాధించిన విజయాలు.. 50 వేల ఉద్యోగాల కల్పన, పలు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు.. రెచ్చగొట్టే బీఆర్ ఎస్ నాయకుల రాజకీయాలు.. కూడా చర్చకు వస్తాయి.
ఇవన్నీ ఇలా ఉంటే.. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారం.. మాజీ మంత్రి హరీష్ రావుపై పలు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు అక్రమ నిర్బంధాలు వంటివి ప్రధానంగా సభలో హాట్ హాట్‌గా సాగనున్నాయనడంలో సందేహం లేదు. ఇక, ఈ సారి సభలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత కొన్నాళ్లుగా.. సీఎం రేవంత్ సహా మంత్రులు కేసీఆర్‌పై సభకు రావడం లేదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఇదే జరిగితే.. తెలంగాణ శాసన సభ సమావేశాలు మరింత రంజుగా మారనున్నాయి.