వైసీపీ అధినేత జగన్ వచ్చే నెల జనవరి నుంచి తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వస్తానని చెప్పిన విసయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. జగన్ బయటకు వస్తున్నది లేదు. కేవలం బెంగళూరు-కడప-తాడేపల్లి అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. మరోవైపు పార్టీ నుంచి పోయే నాయకులుపోతున్నారు. వచ్చే వారు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలోనూ వైసీపీకి సానుభూతి లేకుండాపోయింది.
ఈ పరిణామాలతో జగన్ ఇక, కదలాల్సిందేనని నిర్ణయించుకుని తాడేపల్లి నుంచి బయటకు వస్తానని ఇటీవల చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనలకు ఆయన రెడీ అయ్యారు. అంతేకాదు.. కేడర్‌ను కూడా ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నేతలతో వరుసగా తాడేపల్లిలో ఆయన సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే తాను జిల్లా పర్యటనలకు వస్తానని.. ప్రతి బుధవారం, గురువారం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండి ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతానని చెప్పారు.
ఇక, ఇప్పుడు జగన్ పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ సిద్ధమవుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఉత్తరాంధ్ర నుంచి జగన్ పర్యటనలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా నియోజకవర్గాల్లో ఆయన తొలి పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరకు పార్లమెంటు నుంచితొలి పర్యటన ఉంటుందని.. తర్వాత పాడేరు వంటి ఎస్టీ నియోజకవర్గాల మీదుగా జనరల్ నియోజకవర్గాల వరకు ఈ పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
టార్గెట్ సూపర్ సిక్స్!
వైసీపీ అధినేత తన పర్యటనలో కూటమి పార్టీలు ఎన్నికలకుముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలనే టార్గెట్ చేసుకుంటారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పరిపాలనలో ఆరుమాసాల్లోనే విఫలమైందని ప్రజలను ఆదుకునే వారు లేకుండా పోయారన్న ఆయన వ్యాఖ్యలను బట్టి.. కూటమి సర్కారు ప్రకటించిన సూపర్ సిక్స్.. ముఖ్యంగా మాతృవందనం, మహిళలకు రూ.1500 నిధులు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని జగన్ విమర్శలు చేసే అవకాశం ఉంది.