తెలంగాణలో వరుసగా రెండు సార్లు పాలన సాగించిన బీఆర్ ఎస్ పార్టీని గద్దెదించి.. అనేక చర్చలు.. అనేక సంప్రదింపుల అనంతరం.. కొమ్ములు తిరిగిన, కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులను సైతం పక్కన పెట్టి పార్టీ అధిష్టానం.. కట్టబెట్టిన ముఖ్యమంత్రి పీఠంపై “ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను” అని ప్రమా ణం చేసి కూర్చున్న తెలంగాణ సీఎంకు ఏడాది పూర్తయింది. 2023, డిసెంబరు 7వ తేదీన హైదరాబాద్‌లో అంబరాన్నంటేలా జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో(వ్యక్తిగా) ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఏడాది కాలంలో..
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏడాది పాటు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారనే చెప్పాలి. అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. ప్రతిపక్షం దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అహర్నిశలు కష్టించారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్‌ను పెంచడంతోపాటు.. బీఆర్ ఎస్‌కు ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక, బీజేపీని దునుమాడడంలోనూ.. కేంద్రం కుయుక్తులను బట్టబయలు చేయడంలోనూ.. ఆయన వెనుకాడలేదు.
ప్రధాని మోడీని పెద్దన్న
అని సంబోధించి.. అందరినీ నివ్వెరపరిచినా.. తర్వాత కాలంలో కేంద్రం నుం చి నిధులు రావడం లేదని దుయ్యబట్టినా.. రేవంత్ తనకు తాను సమర్థించుకున్నారు. ఇక, అతి పెద్ద అంతర్గత ప్రజాస్వామ్యం నెలకొన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠంపై అనేక మంది కి ఆశ ఉంది. అయితే.. అందరికీ మచ్చిక అవుతూ.. అందరినీ మచ్చిక చేసుకుంటూ ముందుకు సాగడంలో ఈ ఏడాది రేవంత్ గ్రాఫ్ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు.
కీలక విషయాలు..
— బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేయాలన్న కోరిక అయితే.. మెండుగా ఉందన్న విమర్శలు రేవంత్ చుట్టూ అలుముకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారన్న అపప్రదను మూట గట్టుకున్నారు. అయినా.. ముందుకే సాగారు.
— పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో ముందుకు తీసుకువెళ్లారంటే సందేహం లేదు. అనుకు న్న స్థాయికంటే కొంచెం ఎక్కువగానే కష్టించారు.
— తెలంగాణపై కేసీఆర్ ముద్ర లేకుండా చేస్తానని బహిరంగంగానే చెప్పే రేవంత్.. ఆదిశగానే హైడ్రా వంటి వ్యవస్థను తీసుకువచ్చారు. తెలంగాణ తల్లి రూపు రేఖలు మారుస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. దూకుడైన నిర్ణయాలకు కేరాఫ్‌గా మారారు.
— కేసీఆర్ ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలకు మంగళం పాడి కొత్త పథకాలను ప్రవేశ పెట్టాలని అనుకున్నా.. కొన్ని మాత్రమే చేయగలిగారు. వీటిలో రుణమాఫీ ఒకటి. సన్న వడ్లకు రూ. ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు. ఈ కారణంగా రైతు బంధు కన్నా ఎక్కువ మేలు జరుగుతోందన్న టాక్ ఉంది.
— వచ్చీ రావడంతోనే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చారు. రుణమాఫీ చేశారు. గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గాడిలో పెట్టారు.
— రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన రేవంత్ కొంత మేరకు ఈ విసయంలో సక్సెస్ అయ్యారు. ఇక, రాజకీయాల పరంగా విపక్షాల దూకుడును తట్టుకునేందుకు చెమటోడుస్తున్నారనే చెప్పాలి.
ముందున్న సమస్యలు.. ఇవీ..
— కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోతున్నారన్న వాదన అయితే ఉంది. దీనిని అధిగమించేందుకు రేవంత్ కృషి చేయాల్సి ఉంటుంది.
— మంత్రి వర్గ విస్తరణపై అనేక సార్లు ఊరించారు తప్ప.. ముందుకు సాగలేక పోయారు. దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
— వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి.
— అంతర్గత కుమ్ములాటలను అరికట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.