`వెల్‌డ‌న్ లోకేష్‌`– నారా భువ‌నేశ్వ‌రి పుత్రోత్సాహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి పుత్రోత్సాహంతో సంతోషం వ్య‌క్తం చేశారు. `వెల్‌డ‌న్ లోకేష్‌` అంటూ త‌న కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. దీనికి కార‌ణం.. త‌న తండ్రి, సీఎం చంద్ర‌బాబు భోజ‌నం చేసిన ప్లేటును స్వ‌యంగా నారా లోకేష్ తీయ‌డ‌మే! ఏపీలో జ‌రిగిన విద్యార్థులు-త‌ల్లిదండ్రుల స‌మావేశాలను పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు, లోకేష్‌లు బాప‌ట్ల‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి చిన్నారుల‌తో క‌లిసి ఇరువురూ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశారు.

సీఎం, మంత్రి.. ఇరువురూ నేల‌పైనే కూర్చుని విద్యార్థుల‌తో ముచ్చ‌టిస్తూ భోజ‌నం చేశారు. అనంత‌రం.. సీఎం చంద్ర‌బాబు త‌ను తిన్న ప్లేటును అక్క‌డే వ‌దిలేయ‌గా.. నారా లోకేష్ త‌న భోజ‌నం అయిపోయిన త‌ర్వాత‌.. త‌న ప్లేటుతోపాటు సీఎం చంద్ర‌బాబు భోజ‌నం చేసిన ప్లేటును కూడా ఎత్తారు. ఇంత‌లో స‌హాయ‌కురాలు రావ‌డంతో ఆమెకు ఆ రెండు ప్లేట్లు, గ్లాసులు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వీటిని తిల‌కించిన నారా లోకేష్ మాతృమూర్తి భువ‌నేశ్వ‌రి ఉప్పొంగిపోయారు. ప‌త్రోత్సాహం వ్య‌క్తీక‌రించారు.

వెల్‌డ‌న్ నారా లోకేష్ .. అని భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు. “చంద్ర‌బాబుగారు భోజ‌నం చేసిన ప్లేట్‌ను తీసుకుని శుభ్ర‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేయ‌డం నీ ఆలోచ‌నాత్మ‌కమైన దృక్ఫ‌థాన్ని ప్ర‌తిబింబిస్తోంది. భోజన అనంతరం శుభ్రం చేస్తున్న పాఠ‌శాల‌ సిబ్బందికి సాయపడడం బాగుంది. తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చాటి చెబుతున్నాయి. నిత్యం మనకు సహాయకారిగా(ప‌నివాళ్లు) ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ చర్య ద్వారా స్పష్టం చేశావు. నిజంగా ఇది స్ఫూర్తిదాయకంష‌ అని నారా భువనేశ్వరి ప్రశంసలు గుప్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో భువ‌నేశ్వ‌రి చేసిన పోస్టుకు భారీ సంఖ్య‌లో లైకులు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.