సిరియాలో పరిణామాలు ఉద్రిక్తతకు దారితీయడంతో భారత ప్రభుత్వం అక్కడ ఉన్న పౌరులకు ఆ దేశాన్ని వెంటనే విడిచి రావాలని సూచించింది. శుక్రవారం రాత్రి కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై కీలక అడ్వైజరీ విడుదల చేస్తూ, సిరియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొంది. అక్కడ ఉన్న భారతీయులు కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే తిరిగి రావాలని సూచించింది.
కేంద్రం జారీ చేసిన సూచనల ప్రకారం, సిరియాలో ఉన్న పౌరులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదించాలి. అత్యవసర సమస్యల పరిష్కారానికి +963 993385973 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. ఇది వాట్సాప్‌కు కూడా ఉపయోగపడుతుందని పేర్కొంది. అదనంగా, hoc.damascus@mea.gov.in అనే ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఎంబసీ సిబ్బందిని సంప్రదించవచ్చని వివరించింది.
సిరియాలో పరిస్థితులు అత్యంత విషమంగా మారాయి. అక్కడి తిరుగుబాటు గ్రూపులు అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టర్కీ మద్దతు పొందిన ఈ తిరుగుబాటు దళాలు గత కొద్ది రోజులుగా దేశంలో అనేక హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. రష్యా, ఇరాన్ మద్దతు ఉన్న బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ గ్రూపులు తమ దాడులను మరింత ఉద్ధృతం చేశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణమే అప్రమత్తంగా వ్యవహరించింది. అక్కడ ఉన్న భారతీయులు తమ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, అవసరమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది. సిరియా నుంచి తక్షణమే బయటకు రావాలని జారీ చేసిన ఈ హెచ్చరిక భారత పౌరుల భద్రతపై కేంద్రం తీసుకుంటున్న చొరవను సూచిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates