తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న వివాదాలకు తోడు ఇప్పుడు సరికొత్త వివాదం తెరమీదికి వచ్చింది. `తెలంగాణ తల్లి` విగ్రహ రూపంలో అధికార-ప్రతిపక్షాలకు మధ్య రాజకీయ సెగ రాజుకుంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.. అప్పటి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలిసారి ఏర్పాటు చేసింది. తలపై కిరీటం, చేతిలో మక్కల కంకులు, మరో చేతిలో బోనం పట్టుకుని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారు. దీనిని అధికారిక చిహ్నంగా తెలంగాణ తల్లిగా కూడా ప్రకటించారు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పుబట్టింది.
తెలంగాణ తల్లి విగ్రహం.. రాజసాన్ని ఉలికి పడేలా చేస్తోందని.. తెలంగాణ తల్లులు రాజమాతలు కాదని, వారు కష్టజీవులని.. పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు హావభావాలు కనిపిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్ర వాస్తన ప్రజానీకం సంస్కృతికి భిన్నంగా ఉందని, ధనిక స్త్రీగా చిత్రీకరించారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగహ్రం రూపు రేఖలను మార్చేశారు. ఫ్రోఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. తాజా విగ్రహంలో కాళ్లకు పట్టీలు, మెట్టెలు, పసుపు పచ్చ అంచుతో కూడిన ఆకుపచ్చ చీర, మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి.
ఈ నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించనున్నారు. అయితే.. ఈ విగ్రహంపై రాజకీయ క్రీనీడలు అలుముకున్నాయి. తాము తొలిసారి ఏర్పాటు చేసిన విగ్రహమే అసలు సిసలు తెలంగాణ తల్లి అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ విమర్శలు గుప్పించింది. అంతేకాదు.. ప్రస్తుతం రూపొందించిన విగ్రహంలో సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైన పార్టీ జెండా రంగును జోడించారంటూ.. దుయ్యబట్టడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. `కొత్త తల్లి ఎవరు..? తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లినా?` అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదేసమయంలో మాజీ సీఎం కేసీఆర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపైనా కేటీఆర్ స్పందించారు. ‘‘ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం రేవంత్ ఇంట్లో పెళ్లికాదని.. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ప్రోటోకాల్ ప్రకారం విపక్ష నేతకు ఎలానూ ఆహ్వానం ఉంటుందన్నారు.ఇక, గతంలో తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఏంచేస్తున్నారు? ఎక్కడున్నారని(టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే) ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత మాత విగ్రహంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. భారత మాత విగ్రహాన్ని ఇందిరమ్మ ఏర్పాటు చేశారని, కానీ, తర్వాత వచ్చిన వాజపేయి దానిని మార్చలేదన్నారు. నాలుగేళ్ల తర్వాత అయినా..తాము అధికారంలోకి వస్తామని.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం గమనార్హం.