వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక్కం విజయసాయిరెడ్డి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా వైసీపీలో ఆయన వ్యవహరిస్తున్నతీరు.. పార్టీ అధినేత జగన్‌కు తిక్కరేపుతోందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. “ఇదేంటి ఈ వ్యాఖ్యలు..?”అంటూ ఓ సీనియర్ నాయకుడు మీడియా మిత్రుల ముందు చెప్పుకొని రావడం చర్చకు దారితీసింది. నిన్న మొన్నటి వరకు పవన్‌ను ఆడిపోసుకున్న సాయిరెడ్డి యూటర్న్ తీసుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రీజన్లు ఇవేనా?
1) రాజకీయ వైరం తగ్గించుకునేందుకా: రాజకీయ నేతలు ఏం చేసినా.. దానికి అర్ధం పరమార్థం ఉంటాయి. అలానే ఇప్పుడు సాయిరెడ్డి దూకుడు చూస్తే.. పవన్ విషయంలో ఆయన స్పందిస్తున్న తీరు రాజకీయంగా పవన్‌తో తనకు ఉన్న వివాదాలను, వైరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచి కూడా వైరంతోనే ముందుకు సాగిన సాయిరెడ్డి.. అనేక సందర్భాల్లో పవన్‌ను వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కానీ, ఇప్పుడు పవన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
2) కాకినాడ పోర్టు సమస్య: తాజాగా కాకినాడ పోర్టు విషయంలో ముఖ్యంగా సీపోర్టు యజమాని కేవీ రావు ను వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు బెదిరించి వాటా(41శాతం) రాయించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం సీఐడీ విచారణ చేస్తోంది. ఈ విచారణలో సాయిరెడ్డి పేరు, ఆయన అల్లుడు అరబిందో సంస్థ సీఈవో పేరు కూడా నమోదైంది. దీనికి మూల కారణం.. పవన్ పైవెళ్లి అక్కడ పరిశీలించడమే. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టు కేసు ముందుకు సాగకుండా ప్రభావితం చేసే వ్యూహంలో భాగంగానే పవన్ పై ఇలా ప్రశంసలు గుప్పిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
3) జనసేన-టీడీపీలో చిచ్చు: ఇక, కీలకమైన మరో విషయం.. పవన్‌ను ఆకాశానికి ఎత్తడం ద్వారా.. టీడీపీ జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టాలన్న వ్యూహం కూడా దాగి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రెండు పార్టీలు కలివిడిగా ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే వెళ్తామని.. సీఎం చంద్రబాబేనని పవన్ సభలోనే ప్రకటించారు. ఈ క్రమంలో వారు కలిసి ఉంటే వైసీపీ గెలుపు కష్టమని భావించి.. పవన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా.. సాయిరెడ్డి వ్యూహాత్మకంగా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.