ప‌ది నెల‌ల కాంగ్రెస్ బాధ్య‌త‌లు.. ష‌ర్మిల ప్ల‌స్సా.. మైన‌స్సా.. !

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కంటే.. త‌న అన్న స‌మ‌స్య‌తో నే ఎక్కువ‌గా ఆమె స‌త‌మ‌తం అవుతున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. దానిని జ‌గ‌న్ కు ముడి పెట్టి ముచ్చ‌ట తీర్చుకుంటున్నారు. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి.. నేటికి ప‌ది మాసాలు పూర్త‌య్యాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 5న ఢిల్లీలో కాంగ్రెస్ నేత‌ల స‌మావేశంలో ష‌ర్మిల‌ను.. ఏపీ చీఫ్‌గా నియ‌మిస్తూ.. కాంగ్రెస్ పెద్ద‌లు తీర్మానం చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఆమెకు ఉన్న తెలంగాణ వైఎస్సార్ పార్టీని విలీనం చేశారు.

మొత్తంగా ష‌ర్మిల కాంగ్రెస్ ప‌గ్గాలు తీసుకుని నేటికి 10 మాసాలు పూర్త‌య్యాయి. అనంత‌రం.. ఆమె త‌న కుమారుడి వివాహం నిమిత్తం కొంత గ్యాప్ తీసుకుని.. రాజ‌కీయంగా అడుగులు వేశారు. అయితే.. అప్ప‌టి బాధ్య‌త‌లు తీసుకోవ‌డం.. వారు ఇవ్వ‌డం వెనుక‌.. ప్ర‌ధాన ల‌క్ష్యం.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డం. వైసీపీలోకి వెళ్లిపోయిన‌.. కాంగ్రెస్ కురువృద్ధుల‌ను తీసుకువ‌చ్చి.. పార్టీ లైన్‌లో నిల‌బెట్ట‌డం.. ఓటు బ్యాంకు పెంచి.. ప్ర‌జ‌ల‌లో కాంగ్రెస్‌పై అభిమానం కురిపించ‌డం.

ఇవీ.. ఇత‌మిత్థంగా కాంగ్రెస్ పార్టీ ష‌ర్మిల‌కు అప్ప‌గించిన ప్ర‌ధాన బాధ్య‌త‌లు. వీటికి ఆమె త‌లూపారు కూడా . ఈ క్ర‌మంలోనే పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన కొత్త‌లో కొణ‌తాల రామ‌కృష్ణ స‌హా చాలా మంది సీనియ‌ర్ల నాయ‌కుల ఇళ్ల‌కు వెళ్లి మంత్రాంగం నెరిపారు. కానీ, వారు ఇప్పుడు కాదు.. అంటూ తిర‌స్క‌రించారు. దీంతో త‌న మానాన త‌ను రాజ‌కీయాలు చేసుకున్నారు. అయితే.. పార్టీకి రాజ‌కీయాల‌కు కూడా రాం రాం చెప్పిన‌.. ర‌ఘువీరా వంటివారు మాత్రం కొంత మేర‌కు యాక్టివ్ అయ్యారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న సాకే శైల‌జానాథ్ వంటివారు డీ యాక్టివ్ కావ‌డం గ‌మ‌నార్హం.

మొత్తంగా ష‌ర్మిల కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌డుతూనే.. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆమె పోటీ చేశారు. అంతేకాదు.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వంటి అప్ప‌టి ఎమ్మెల్యేల‌కు టికెట్‌లు కూడా ఇచ్చారు. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏకైక అజెండాగా త‌న అన్న‌, బాబాయి విష‌యాలు ఎంచుకోవ‌డంతో పెద్ద‌గా స‌క్సెస్ కాలేక పోయారు. అంటే.. అన్న‌ను అధికారంలో నుంచి దించ‌గ‌లిగాన‌ని ఆమె చెప్పుకొన్నా.. పార్టీప‌రంగా మాత్రం ఆమె వేసిన అడుగులు స‌క్సెస్ కాలేదు. ఇక‌, వ్య‌క్తిగ‌తంగా ఆమె పోటీ చేసిన క‌డ‌ప‌లోనూ.. డిపాజిట్లు వెన‌క్కి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. ఈ ప‌ది నెల‌ల్లో ష‌ర్మిల మార్కు నాయ‌క‌త్వం.