రెండు జిల్లాలను ఒకే ఎంపీ శాసిస్తున్నారా? తన ఆధిపత్య పోరులో రాజకీయాలను వేడెక్కిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కడప నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి విజయం దక్కించుకున్న ఎంపీ సీఎం రమేష్. ఆయన సొంత జిల్లా కడప. కానీ, రాజకీయంగా వచ్చిన అవకాశంతో ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు అటు కడపలోను, ఇటు అనకాపల్లిలోనూ.. తనదైన రాజకీయాలకు తెరదీశారు.
అయితే.. ఈ రాజకీయాలు అభివృద్ధికి అనుగుణంగా ఉంటే ఇబ్బంది లేదు. కానీ, రాజకీయంగా వివాదాలకు, విభేదాలకు తావిస్తుండడం పెద్ద సమస్యగా మారింది. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు ఎంపీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా ఇక్కడ టీడీపీ నాయకులు ఫిర్యాదులపై ఫిర్యాదులు మోస్తున్నారని సమాచారం. కానీ, సీఎం రమేష్‌కు సీఎం చంద్రబాబు వద్ద ఉన్న పలుకుబడి.. ఇతరత్రా అనుబంధాలతో ఎలాంటి చర్యలూ తీసుకోలేక పోతున్నారు.
ఇక, కడపలో బీజేపీ నాయకుడు.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో సీఎం రమేష్ విభేదాలు రచ్చకెక్కాయి. ఆదికి వ్యతిరేకంగా సీఎం రమేష్.. ఎంతకైనా అన్నట్టు రాజకీయాలు చేస్తున్నారు. కాంట్రాక్టుల నుంచి స్థానిక పాలిటిక్స్ వరకు.. కూడా ఆదిపై సై అంటే సై అంటూ.. సీఎం రమేష్.. రోడ్డెక్కుతున్నారు. అయితే.. ఆయన బయటకు రాకుండా. తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నారనేది ఆది వర్గం చెబుతున్న మాట. ఇటీవల వెలుగు చూసిన ఫ్లైయాష్ వివాదంలో కూడా సీఎం రమేష్ ఉన్నారన్నది తాజాగా వెలుగు చూసిన విషయం.
బీజేపీ నేత ఆది నారాయణపై పైచేయి సాధించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీకి సీఎం రమేష్ సహకరిస్తున్నారని.. బీజేపీలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట. కానీ, బీజేపీలోనూ పెద్దలతో ఆయనకు ఉన్న సంబంధాలు.. ఈ విషయంలో ఆదిని కట్టిపడేస్తున్నాయి. దీంతో ఆయనకు విషయం తెలిసినా.. కూడా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అటు అనకాపల్లిలో టీడీపీతోనూ.. ఇటు కడపలో బీజేపీతోనూ.. రాజకీయాలు బాగానే చేస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తుండడం గమనార్హం.