అనంపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజూ ప్రజలకు చేరువయ్యారు.
అదేవిధంగా స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను కూడా పరిష్కరించారని అంటారు. అయితే.. ధర్మవరంలో బీజేపీ గెలిచిన తర్వాత.. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యాక ఇక్కడ సీన్ మారిపోయిందని చెబుతున్నారు.
వెంకట్రామిరెడ్డి బయటకు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు.. నిరంతరం బయటకు వచ్చిన కేతిరెడ్డి ఇప్పుడు ఇల్లు కదలడం లేదు.
దీనికి కారణం.. బయటకు వచ్చి కూటమి సర్కారుపై ఎలాంటి విమర్శలు చేసినా.. అవి తన వ్యాపారాలపైనా.. ఆస్తులపై ప్రభావం చూపుతాయని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంట్లోనే కూర్చుని వీడియో లు చేసుకుంటున్నారు. వైసీపీ తప్పులను ఆయన ఎత్తిచూపుతున్నారు.
అయినప్పటికీ.. కేతిరెడ్డిని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన 45 ఎకరాల భూముల దోపిడీ వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
ధర్మవరంలోని కీలక చెరువు 1700 ఎకరాల్లో ఉంది. దీనిలో 45 ఎకరాలను ఆక్రమించి.. ఆయన వదిన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారన్నది ప్రధాన అభియోగం. వాస్తవానికి చెరువులు..కుంటలు అనేవి ఆక్రమించేందుకు వీలు లేదని.. వాల్టా చట్టం చెబుతోంది. ఎవరైనా ఆక్రమిస్తే.. 500 శాతం పరిహారం వసూలు చేసే రైట్స్ ఉంటాయి.
ఈ విషయంపైనే కూటమి నేతలు, ముఖ్యంగా మంత్రి సత్య కుమార్ అనుచరులు దృష్టి పెట్టారు. ఈ భూములను వెనక్కి తీసుకోవడంతోపాటు.. జరిమానా కూడా భారీగా విధించాలన్నది వారి డిమాండ్‌గా ఉంది. అయితే.. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఫాం హౌస్ సహా.. గుర్రపు శాల, క్రీడా మైదానం వంటివి నిర్మించారు. అయినప్పటికీ.. వీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోయిన దరిమిలా.. ప్రభుత్వ పరంగా దూకుడు పెంచితే ఫలితం ఆశించినట్టు ఉండదని గ్రహించి.. న్యాయపరంగా పోరాటానికి దిగారు. దీంతో కేతిరెడ్డి అడ్డంగా దొరికి పోవడం ఖాయమన్న చర్చ సాగుతుండడం గమనార్హం.