ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకున్నారే కానీ.. ఇతర వర్గాలు.. ముఖ్యంగా ప్రజలు మాత్రం చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. ఒక్కసారి రాజధానిని ఫిక్స్ చేయడం.. అక్కడి రైతుల నుంచి భూములు తీసుకుని కొంత మేరకు ప్లాన్లు కూడా రెడీ చేసుకోవడం, సచివాలయం, హైకోర్టు, శాసన సభ, మండలి వంటివాటిని నిర్మించడం.. వంటివి ప్రజలు సీరియస్‌గానే తీసుకున్నారన్న విషయం.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. అయితే.. జగనే ప్రజల నాడిని తెలుసుకోలేక పోయారు.
రాజధాని నిర్మాణం కోసం.. అనేక మంది కానుకలు ఇచ్చారు. కొందరు నిలువు దోపిడీ కూడా(ఒంటిపై ఉన్న బంగారాన్ని అప్పటికిప్పుడు తీసి ఇవ్వడం) ఇచ్చారు. మహిళలు తాము దాచుకున్న పుట్టింటి ఆస్తిలో కొంత భాగాన్ని ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇక, చిన్న పిల్లలు కూడా.. పెద్ద ఎత్తున కిట్టీబ్యాంక్ సొమ్మును ఇచ్చారు. మరికొందరు తమకు వచ్చే సామాజిక భద్రతా పింఛను(4000)ను కూడా అందించారు. ఇలా.. రాజధానికి తమ వంతు సాయం చేసిన వారు ఉన్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రజలు తరలి వచ్చి.. ప్రాంతాలకు అతీతంగా.. విరాళాలు ఇస్తున్నారంటే ఏమనుకోవాలి.. వారు బలంగా రాజధాని అమరావతిని కోరుకుంటున్నారనే కదా!
ఇక, ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే.. రాజకీయాలకు.. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలకు కూడా కడు దూరంలో ఉండే.. మఠాలు కూడా.. రాజధాని బాగు కోరుకుంటున్నాయి. రాజధాని నిర్మాణానికి తరలి వస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయానికి గురు రాఘవేంద్ర మఠం.. రాజధానికి విరాళం ఇచ్చింది. రాఘవేంద్ర మఠం అంటే.. ఆషామాషీ కాదు.. ఇన్నేళ్లలో ఒక్క ఆరోపణ కానీ, ఒక్క నింద కానీ.. ఆ మఠంపై లేకపోవడం గమనార్హం.
అంతేకాదు.. రాజకీయాల్లోకి అసలు ప్రవేశం లేదు. ఎంత వరకు వ్యవహరించాలో అంతవరకే మఠం అనుసరిస్తుంది.. అవసరం ఉన్న వరకే స్పందిస్తుంది. అలాంటి రాఘవేంద్ర మఠం తాజాగా.. అమరావతి నిర్మాణానికి రూ.50 లక్షలు ఇచ్చింది. మఠం స్వామి సుబుదేంద్రతీర్థులు తాజాగా సీఎం చంద్రబాబును కలిసి.. విరాళాలు ఇచ్చారు.
అంతేకాదు.. అమరావతికి ఎలాంటి విఘ్నాలు లేకుండా.. ముందుకు సాగేందుకు తమ వంతు కృషి చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా అహోబిలం మఠం కూడా అమరావతికి 50 లక్షలు ప్రకటించింది. అయితే.. దీనిని త్వరలోనే అందజేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇలా.. రాజకీయాలకు సంబంధం లేని మఠాలే రాజధాని కోసం కదులుతున్నాయంటే.. ఎంత ప్రాధాన్యం ఉందో.. జగన్ గుర్తించలేక పోవడం.. శోచనీయం అంటున్నారు పరిశీలకులు.