ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు ఎప్పుడు అందుతాయనే ప్రశ్నకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫలాలను ఆయా సామాజిక వర్గాలకు అందించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. చేసినతొలి సంతకం.. 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీపైనే. దీనికి సంబంధించి డీఎస్సీ ప్రకటన కూడా విడుదలైంది. అయితే.. ఆరు మాసాలైనా డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై సందిగ్థత కొనసాగుతోంది. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. డీఎస్సీ నుంచే ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందించాలని నిర్నయించుకున్నట్టు పేర్కొంది.
రెండు నెలల కిందట సుప్రీంకోర్టు.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఇచ్చిన సుప్రీంకోర్టు.. వర్గీకరణను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ వర్గీకరణ ఫలాలను డీఎస్సీ అభ్యర్థుల నుంచే ప్రారంభించాలని నిర్ణయించడం గమనార్హం. తద్వారా.. దేశంలోనే తొలిసారి.. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వరకు వేచి చూడాలని విద్యార్థులకు తాజాగా సూచించింది.
కమిటీ ఏర్పాటు..
ఏపీలో ఎస్సీ వర్గీకరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ రంజన్(ఆర్ ఆర్) మిశ్రా నేతృ త్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. ఈ కమిటీని డిసెంబరు 15లోగా ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఈ కమిటీకి 3 మాసాల గడువును ఇవ్వనున్నారు. ఈ మూడు మాసాల్లో కమిటీ సంపూర్ణంగా అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణపై నివేదికను ఇవ్వనుంది. దీనిని అసెంబ్లీలో ఆమోదించి.. కేంద్రానికి పంపిస్తారు. అనంతరం.. దీనినిరాష్ట్రపతి ఆమోదంతో అమలు చేయనున్నారు. దీనికి కొంత సమయం పట్టినా.. విద్యార్థులకు మేలు జరుగుతుందన్నది ప్రభుత్వం చెబుతున్న మాట.
ఎలా చేస్తారు?
ప్రస్తుతం ఏపీ సర్కారు చెబుతున్న మేరకు.. ఎస్సీవర్గీకరణను రాష్ట్రాన్ని యూనిట్‌గా కాకుండా.. జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటారు. అది కూడా ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకుని అధ్యయనం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల ఎస్సీమాల వర్గం ఎక్కువగా ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో మాదిగ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటే.. మాలలకు అన్యాయం జరుగుతుందని లెక్కలు వేసుకున్న ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా తీసుకుని వర్గీకరణకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆర్. ఆర్. మిశ్రాకమిటీ వేయాలని నిర్ణయించుకుంది.